కన్న కూతుళ్ల ఎదుటే జర్నలిస్టుపై కాల్పులు; పరిస్థితి విషమం

0
120

ఘజియాబాద్; దేశ రాజధాని న్యూఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లో సోమవారం రాత్రి ఓ జర్నలిస్టుపై కొందరు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. స్థానిక విజయ్ నగర్ ప్రాంతంలోని రహదారిపై ఆయన తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మోటారుసైకిలుపై వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను ఆపి తుపాకితో కాల్చారు. ఓ బుల్లెట్ జోషి తలలోకి దూసుకెళ్లడంతో ఆయన కుప్పకూలిపోయారు. విషమ పరిస్థితిలో ఉన్న ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జోషిపై హత్యాయత్నం దృశ్యాలు సమీపంలోని ఓ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కొందరు వ్యక్తులు ఆయన బైక్ ను ఆపి కిందకు లాగడంతో బైక్ కింద పడిపోయింది. ఆయన కుమార్తెలు భయంతో దూరంగా పారిపోయారు. రెప్పపాటులో దుండగులు తూటాలు పేల్చడంతో జోషి నేలకొరిగారు. వెంటనే అగంతుకులు పారిపోవడంతో ఆయన కుమార్తెలు పరుగున వచ్చి విలపించారు. ఓ కుమార్తె దారినపోయేవారినందరినీ ఆపి తన తండ్రిని ఆసుప్రతికి తరలించేందుకు సహకరించాలంటూ వేడుకుంటున్న దృశ్యాలు కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ కేసులో ప్రధాన అనుమానితులు అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా జోషి కుటుంబానికి తెలిసినవారేనని పోలీసులు చెబుతున్నారు. జోషి తన మేనకోడలిని కొందరు వ్యక్తులు వేధిస్తున్నారని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు.

Leave a Reply