కొవిడ్‌ను తొక్కేసి.. విధులకు వచ్చేసి

1
228

కరోనాతో పోరాడి విజేతలుగా నిలిచి..

అందరిలో ధైర్యాన్ని నింపుతున్న  పోలీసులు

కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. అది ఎక్కడి నుంచి ఎలా ఎవరిపై దాడి చేస్తుందోనని హడలిపోతున్నారు. దాని బారినపడి రాష్ట్రంలో ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా కోరల్లో చిక్కి… వ్యాధితో ధైర్యంగా పోరాడి కోలుకున్న సైబరాబాద్‌ పొలీసులు మాత్రం కొవిడ్‌ను చూసి భయపడొద్దని, ధైర్యంగా ఎదుర్కొని క్షేమంగా బయటపడొచ్చని సూచిస్తున్నారు. కరోనా వ్యాధి కన్నా.. అది వచ్చిందనే భయమే ప్రమాదకరం.. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఆలోచన మనసులోకి రానివ్వొద్దు. మనకు ఎలాంటి వ్యాధి లేనట్లు, దాని గురించి ఏమీ పట్టనట్లు ఉండి బలమైన ఆహారం తీసుకోవడం, చిన్న చిన్న రక్షణ చర్యలు పాటించడం వల్ల చాలా సులభంగా కొవిడ్‌ నుంచి బయటపడొచ్చని పోలీస్‌ యోధులు చెబుతున్నారు. ఇటీవల కరోనాను జయించిన సైబరాబాద్‌ పోలీసులు క్షేమంగా బయటపడి తిరిగి విధుల్లో చేరారు. కరోనా మహమ్మారిని జయించడంలో వారు పాటించిన ఆరోగ్య సూత్రాలు, తీసుకున్న ఆహారం, రక్షణ చర్యల గురించి తెలియజేస్తూ.. కొవిడ్‌ బాధితుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. 

భయాందోళనకు గురికావొద్దు..

-ఎం. శ్రీనివాసు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ 

కరోనా వచ్చిందనే నెగిటివ్‌ థింకింగ్‌ను దరిచేరనీయొద్దు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా మన ఆలోచన పాజిటివ్‌గానే ఉండాలి. ప్రతి రోజు వేడినీళ్లు తాగాలి. డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. వేడి కషాయం తాగాలి. వ్యాయామం, యోగా తప్పనిసరిగా చేయాలి. కరోనా నుంచి మన మనసును ఇతర విషయాలవైపు మళ్లించాలి. కొవిడ్‌ ఆలోచనను, భయాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వొద్దు. మంచి పుస్తకాలు చదవాలి.

అయ్యప్ప స్వామి పాటలు వినేవాడిని..

-శ్యామ్‌ సుందర్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌

కరోనా వ్యాధి కన్నా అది వచ్చిందన్న భయమే చాలా ప్రమాదకరం. ముందు ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. నేను ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు నచ్చిన సంగీతం వినేవాడిని. అయ్యప్ప స్వామి భక్తుడిని కావడంతో ప్రతిరోజు అయ్యప్ప పాటలు వినేవాడిని. ప్రతి రోజు వేప పొడి, పసుపు కలిపిన నీటిని తాగేవాడిని. అల్లం, వెల్లుల్లి , తేనె, తమలపాకు కలిపి తినేవాడిని, ప్రతి రోజు కుటుంబసభ్యులతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పేవాడిని. మన నమ్మకమే మనల్ని విజేతలను చేస్తుంది.

నిమ్మజాతి పండ్లు, కోడిగుడ్డు తీసుకోవాలి…

-వీరభద్రం, ట్రాఫిక్‌ ఎస్సై

ప్రతి రోజు మనం తినే ఆహారంలో కోడిగుడ్డు ఉండేలా చూసుకోవాలి. నిమ్మ, ఆరెంజ్‌తో పాటు.. బొప్పాయి తీసుకోవాలి. ప్రతి రోజు వేడినీళ్లు తాగాలి. మనం తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లితో పాటు మిరియాలు ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు వాకింగ్‌ చేయాలి. మనసును  కుంగదీసే విధంగా మాట్లాడే వారి మాటలు నమ్మొద్దు.

ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం..

-రాజేశ్వరరావు, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

మేం 11 మంది ఐసోలేషన్‌కు వెళ్లాం. మొదట చాలా  భయపడ్డాం. కానీ ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. ప్రతి రోజు యోగా, ప్రాణాయామం చేస్తూ సాత్వికాహారం తీసుకున్నాం. కొద్దిరోజుల్లోనే కరోనాను జయించి క్షేమంగా భయపడ్డాం. ఇప్పుడు తిరిగి విధుల్లో చేరాం. 

చాలా సులభంగా బయటపడొచ్చు…

-సేవ్యానాయక్‌, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

కరోనా వచ్చిన వాళ్లు చాలా సులభంగా బయటపడొచ్చు. ముందు ధైర్యంగా ఉండాలి. ప్రతి రోజు ఆవిరి పట్టాలి. వేడినీళ్లు తాగడం, గొంతులో పోసుకొని పుక్కిలించడం చేయాలి. శ్వాసక్రియ మెరుగయ్యేందుకు తగిన వ్యాయామం చేయాలి. విటమిన్‌–సి, జింకోవిట్‌ మాత్రలు తీసుకోవాలి. మెడిటేషన్‌ చేయడం, రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు తీసుకుంటే చాలా సులభంగా కరోనాను తరిమికొట్టొచ్చు. నేను అలాగే చేసి బయటపడ్డాను.

1 COMMENT

Leave a Reply