ఖతర్నాక్ అత్తాకోడళ్లు.. తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు

0
241

ఈ అత్తాకోడళ్ల రూటే సెపరేటు. నిర్మానుష్య ఉన్న వీధులే వారి లక్ష్యం. అక్కడ తాళం వేసిన ఇళ్లు కనిపించాయంటే ఆ రోజుకు ఆ ఇంట్లో చోరీ జరిగిపోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని భవానీపురం, పటమట, అజిత్ సింగ్ నగర్, మాచవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవలి కాలంలో పలు చోరీ ఘటనలు జరిగాయి. తాళం వేసిన ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడి అందినంత అపహరించినట్లు ఫిర్యాదులు అందాయి. ఒకే తరహాలో చోరీలు జరగడంతో పాత నేరస్తులపై పోలీసులు నిఘా ఉంచారు. అప్పుడే మాచవరానికి చెందిన అత్తాకోడళ్లు బోయపాటి ధనలక్ష్మీ (47), సాత్విక అలియాస్ సిరి (20)లు చిక్కారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వీరు డబ్బు కోసం దొంగతనాలు చేస్తున్నారు. నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్ల కోసం వెతుకుతారు. ఏదైనా ఇంటికి తాళం వేసినట్టు కనిపిస్తే ఎవరూ చూడకుండా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు. నగలు, నగదు దోచుకుని ఉడాయిస్తారు. సీసీఎస్ పోలీసులు ఈ ఘరానా అత్తాకోడళ్లను అరెస్టు చేసి రూ.6లక్షల విలువైన 235 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply