తెలంగాణ పేరు అంతర్జాతీయ స్థాయిలో చర్చనియాంశం

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు ఉందో లేదో తెలియదు కానీ.. భారీ సొమ్ముతో అవినీతి నిరోదకశాఖకు పట్టుబడ్డ కీసర తహసీల్దార్ ఎర్వ బాలరాజు నాగరాజ్ పేరు మాత్రం ఇప్పడు అంతర్జాతీయ దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒక భూపట్టా విషయంలో రూ. 2 కోట్లకు డీల్ మాట్లాడుకుని రూ. 1.10 కోట్లు స్వీకరిస్తూ ఇటీవలే తహసీల్దార్ పట్టుబడిన విషయం జాతీయస్థాయిలో చర్చనియాంశమైంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరమే కాదు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద అవినీతి అని, విధుల్లో భాగంగా చేయాల్సిన పనికి రూ. 2 కోట్లు లంచం అడగడం ప్రపంచంలోనే ఇదే తొలిసారంటూ హైదరాబాద్ లోని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ), వరంగల్ కేంద్రంగా ఉన్న అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సంప్రదించారు. ఒక ప్రభుత్వ అధికారి ఇంత భారీ మొత్తంతో పట్టుబడటం ఇదే తొలిసారి అయినందున అవినీతి తహసీల్దార్ ఎర్వ బాలరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదుచేయాలని వైఏసీ సంస్థ అధ్యక్షుడు పల్నాటి రాజేందర్, జ్వాల సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ ఈమెయిల్ ద్వారా లండన్ లోని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. అవినీతి కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగేది మాత్రమే కాదని, ఇది విధిగా సుపరిపాలన పొందే ప్రజల హక్కుల ఉల్లంఘన అని అన్నారు. అవినీతితో సమాజంలో పౌరుల హక్కులతో పాటు చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతుందన్నారు. ఇలాంటి భారీ అవినీతి వెలుగు చూసినప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనకుండా, ప్రభుత్వ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా కఠిన చట్టాలు తెచ్చేందుకు సిద్ధంగా లేవని వారు పేర్కొన్నారు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగాలంటే ఇలాంటి భారీ అవినీతి కేసులను గిన్నిస్ బుక్ లో నమోదు చేయాలని, దీంతో ప్రపంచంలో అవినీతికి వ్యతిరేకంగా చర్చ జరుగుతుందని, పరిష్కారాలు లభిస్తాయన్నారు.
స్పందించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్..
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ), జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థల దరఖాస్తును స్వీకరించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వారికి మంగళవారం (ఆగస్టు-25) సమాధానం కూడా ఇచ్చింది. ఇంతవరకు గిన్నిస్ బుక్ లో ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన రికార్డుల విభాగం లేదని, ఒకే వ్యక్తి 20 మిలియన్ల రూపాయల అవినీతికి పాల్పడిన విషయం అనంతరం దీనిపై తాము దృష్టి సాధించామని తెలిపింది. దీనికోసం ప్రత్యేక కేటగిరి ప్రారంభిస్తామని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తెలపడం విశేషం.