
గాంధీనగర్ : గల్లీ కార్పొరేటర్కే సెల్యూట్ చేసే పోలీసులు రాష్ట్ర మంత్రి కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తిస్తారో ఊహించుకోగలం. కాని నిబంధనలు బేఖాతరు చేస్తే రాష్ట్రపతిని అయినా అడ్డుకుంటానని ధైర్యంగా చెప్తున్న గుజరాత్లోని మహిళా కానిస్టేబుల్ సునితా యాదవ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. మాస్క్ లేకుండా కర్ఫూ సమయంలో బయటికి వచ్చిన ఐదుగురు యువకులను అడ్డుకున్నందుకు గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కుమారుడు అడ్డుపడటంతో అతడినీ పోలీసు భాషలో బుద్ధి చెప్పింది. ఈ సంఘటన జులై-17న రాత్రి 10 గంటలకు వరాఛా పట్టణంలో జరిగింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో 9 గంటల తర్వాత కర్ఫ్యూ విధించారు. మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. రాత్రి 10 గంటలకు తన సహచర పోలీస్ వాలంటీర్తో కలిసి గస్తీలో ఉన్న సునీత ఎమ్మెల్యే పేరు ఉన్న కారులో వస్తున్న ఐదుగురు యువకులను అడ్డుకుంది. వారు తమ స్నేహితుడు, గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి కుమార్ కాణాని కుమారుడికి తెలపడంతో ఆయన అక్కడికి చేరుకున్నాడు. ఆమె విధులకు అడ్డుపడ్డాడు. ఆమె కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ, 365 రోజులు రోడ్డుపైనే నిలబడే డ్యూటీ వేయిస్తానని బెదిరించాడు. ట్రాన్స్ ఫర్ చేయిస్తానంటూ తన అధికార బలాన్ని ప్రదర్శించాడు. అతడెవరో తెలుసు, ఏం చేయగలడో తెలుసు.. ఆ సమయంలో విధుల్లో ఆమె ఒక్కతే ఉంది. పక్కన కేవలం ఒక పోలీసు వాలంటీర్ మాత్రమే ఉన్నాడు. అయినా ఆమె ధైర్యాన్ని వీడలేదు. పోలీస్ కానిస్టేబుల్ అయినా మంత్రి కొడుకుకు మాటకు మాట బదులిచ్చింది. దమ్ముంటే నన్ను ఇక్కడి నుంచి బదిలీ చేసి చూపమని సమాధానమిచ్చింది. మంత్రి ఫోన్ చేసినా ఆమె మెట్టు దిగలేదు. ఈ తతంగమంతా పోలీస్ వాలంటీర్ వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఆమెకు లక్షలాది మంది మద్దతు పలుకుతున్నారు. ఈ సంఘటనతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. తనకు చావు బెదిరింపులు వస్తున్నాయని, తన వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారంటూ ఆవేదనతో ఆమె రాజీనామా చేయాలని నిర్ణయించడం మరింత చర్చనియాంశమైంది. ఈ అంశంపై పోలీసు శాఖ సైతం ఆమెకు వ్యతిరేకంగా శాఖాపరమైన విచారణ ప్రారంభించడంతో ఆ శాఖపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఈ విషయంపై తన చర్యను సమర్థించుకునేందుకు, పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. తనపై దాడి జరిగే అవకాశముందని, రక్షణ కోసం సిబ్బందిని పంపాలని వేడుకున్నా ఉన్నతాధికారులు స్పందించలేదని నిర్భయంగా చెబుతోంది. అక్కడ జరిగింది కేవలం 10శాతం మాత్రమేనని, 90శాతం విషయాలను తన రాజీనామా లేఖ ఆమోదించాక వెల్లడిస్తానని నిర్భీతితో చెబుతోంది. ఆమె ముక్కుసూటితనం, ధైర్యం, విధుల పల్ల అంకితభావానికి ప్రజలు సెల్యూట్ కొడుతున్నారు. లేడీ సింగం అంటూ కీర్తిస్తున్నారు.