హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం ఎన్ కౌంటర్లో మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీమ్ నేర చరిత్ర, అతనికి సహకరించిన అధికారుల గురించి మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ కు ఫోరం ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ఎన్నో కేసులలో ముద్దాయి, కరుడుగట్టిన నేరస్థుడైన నయీమ్ 2016 ఆగస్టు 8న ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. అనంతరం అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా వివిధ రకాలైన తుపాకులు, పెద్ద ఎత్తున డబ్బు, వాహనాలు, భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పత్రాలు లభించాయి. వాటి గురించి ఆరా తీసిన ప్రత్యేక పరిశోధన బృందం (సిట్) ఎంతో కీలక సమాచారం సేకరించినట్లు అప్పట్లో సిట్ ఐజి వెల్లడించారు. నయీమ్ ఇంటిలో దొరికిన వస్తువులను పరిశీలించినప్పుడు ఎన్నో విషయాలు వెలుగు చూశాయి.
ఏకే-47తో సహా 24 తుపాకులు..
ఒక సామాన్యుడికి సొంత రక్షణకు ఒక తుపాకి కావాలంటే ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. లైసెన్సు ఇవ్వడానికి రకరకాల పోలీసు విచారణ జరుపుతారు. అటువంటి కీలకమైన వ్యవహారం తో కూడిన తుపాకులు నయీమ్ ఇంట్లో 24 లభించడం విశేషం. వాటిలో మూడు ఎ.కె. 47 మరియు ఒక స్టైన్ గన్ ఉన్నాయి. ఇవి సాధారణ పౌరులకు అందుబాటులో ఉండవు. అటువంటిది ఏకంగా24 తుపాకులు, నయీమ్ కు ఎలా వచ్చాయన్నది ఇప్పటికీ అంతుచిక్క లేదు. పోలీసులు, అధికారులు నయీమ్ కు సహకరించి ఉండకపోతే ఈ తుపాకులకు లైసెన్సు ఎవరిచ్చారు? మరింత లోతుగా విచారిస్తే ఈ విషయంలో నయీమ్ కు ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉండవచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలో విచారణ జరుపవలసిన అవసరముందని ఫోరం పేర్కొంది. అతని ఇంట్లో కొన్ని వేల ఎకరాలకు సంబంధించిన 752 భూమీ రిజిస్ట్రేషన్ దస్తావేజులు లభించాయి. ఒక సామాన్యుడు భూమి అమ్మాలన్నా, కొనాలన్నా ఆధార్, పాన్ కార్డు, లింకు డాక్యుమెంట్లు అంటూ రకరకాల పత్రాలు అడుగుతారు. అలాగే సదరు వ్యక్తి ఫోటో మరియు వేలి ముద్రలు కూడా తీసుకుంటారు. ఇన్ని రకాల పద్ధతులు ఉండగా మరి నయీమ్ ఎలా వేల ఎకరాల భూమి 752 రిజిస్ట్రేషన్లు చేయగలిగినాడు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రాజకీయ నాయకుల సహాయం లేనిదీ ఇది జరగడం సాధ్యం కాదు. సయీమ్ చనిపోయినా అతడు స్థాపించిన నేర సామ్రాజ్యం ఇంకా ఉంది. పోలీసు, రాజకీయ నాయకులు, ఇతర అధికారులు సహకరిస్తే ఈ దేశంలో ఏదైనా సాధ్యమే. వందల మంది సామన్యపారులు నయీమ్ బాధితుల్లో ఉన్నారు. భూకట్టాలు, బలవంత వసూళ్ళు, ఎదిరించిన వారిపై దౌర్జన్యం, హత్యల వంటివి అప్పట్లో నయీమ్ కు సర్వసాధారణం. అటువంటి ఘోరాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే…ఇకముందు నయీమ్ లు పుట్టకుండా ఉండాలంటే నయీమ్ బతికి ఉన్న సమయంలో అతనికి సహకరించిన పోలీసు, రాజకీయ నాయకులు, రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ అధికారులపై సమగ్ర విచారణ జరిపి… వారికి శిక్షలు వేయాలి. నయీమ్ ఇంట్లో 602 సెల్ ఫోనులు దొరికినాయి. అందులోని కాల్ డేటాను పరిశీలించిన అతనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో తెలుసుకోవాలి. కానీ ఇప్పటిదాకా అలాంటి విచారణ జరగలేదు. సాధారణంగా చిన్న నేరానికి నేరస్థుని సెల్ఫోను కాలేడేటా సేకరిస్తున్న పోలీసుశాఖ నయీమ్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేసింది. కాల్ డేటా పరిశీలించి… తీగ లాగితే..చాలామంది. పోలీసు ఉన్న తాధికారులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయని ఆందోళన చెందుతున్నట్లు అనుమానాలున్నాయి. నయీమ్ ప్రతి విషయాన్ని డైరీలో రాసే వాడట. నయీమ్ ఇంట్లో 130 డైరీలు బయటపడ్డాయి. అందులో చాలామంది పోలీసు ఆఫీసర్ల మరియు రాజకీయ నాయకుల పేర్లు ఉండి ఉంటాయి. అలాంటి డైరీలను సరిగా పరిశీలించక వాటిని న్యాయస్థానంలో డిపాజిట్ చేయడం జరిగింది. సిట్ వారు జరుపుతున్న విదారణ మందకొడిగాను, అదేవిధంగా పైపైన జరుగుతుంది. లోతుగా విచారణ జరగడం లేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని నయీమ్ ఇంటిలో దొరికిన 24 తుపాకులు, 752 రిజిస్ట్రేషన్ దస్తావేజులు మరియు 130 డైరీలపై సమగ్ర విచారణ జరపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లో రాష్ట్ర గవర్నర్ ను కోరుతూ లేఖ రాసింది.