డేటింగ్ పేరుతో చీటింగ్

0
184

జర భద్రం తమ్ముళ్లూ…

ఆన్ లైన్ మోసాల్లో పలు రకాలు ఉండగా అందులో ఇదో తరహా. డేటింగ్ వల విసిరి యువకులను బుట్టలో వేసి డబ్బులు దండుకుంటుందో ముఠా. రోజుకు రూ.కోటి సంపాదిస్తుందంటే ఈ మాయగాళ్ల వలలో ప్రతిరోజు ఎంతమంది చిక్కుకుంటున్నారో గ్రహించవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ షాద్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఓ డేటింగ్ యాప్ ఓపెన్ చేసి మొబైల్ నంబరు సహా తన వివరాలు నమోదు చేశాడు. తర్వాత అతనికి వచ్చిన ఫోన్ కాల్ లో మాట్లాడిన యువతి అతనికి సమీప ప్రాంతంలోని అమ్మాయిల వివరాలు పంపుతామని నమ్మించి రిజిస్ట్రేషన్ ఫీజు, పలు స్కీముల కింద సుమారు రూ.14 లక్షలు ఆన్ లైన్ ద్వారా కట్టించుకుంది. తర్వాత ఆ ప్రాంతంలో డేటింగ్ కు అమ్మాయిలు అందుబాటులో లేరని చెప్పడంతో డబ్బు వెనక్కు ఇవ్వాలని బాధితుడు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత ఆ ఫోన్ నంబరు పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాగే మరో ఫిర్యాదు కూడా అందడంతో పోలీసులు దర్యాప్తు చేసి పశ్చిమ్ బంగలోని సిలిగురి కేంద్రంగా ఈ మోసాలు జరుగుతున్నాయని గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లి 2 వారాలు రెక్కీ నిర్వహించింది. ఏబీసీ ఫైనాన్స్ బోర్డు పెట్టుకుని కాల్ సెంటర్లు నిర్వహించి ఈ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురిని ఈ నెల 11న అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్ టాప్, 31 సెల్ ఫోన్లు, 12 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సిలిగిరిలో 35 కాల్ సెంటర్లు నిర్వహిస్తూ ప్రతిరోజు సుమారు కోటి రూపాయలు వరకు మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. డేటింగ్ యాప్ ల జోలికి వెళ్లొద్దని, అపరిచితులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని, ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనరు సజ్జనార్ ప్రజలకు సూచించారు.

Leave a Reply