తప్పిపోయిన పిల్లల్ని గుర్తించినమహిళా హెడ్ కానిస్టేబుల్ కు అసాధారణ ప్రమోషన్

0
158
వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో పురుషులకు తానేమీ తీసిపోనని నిరూపించిందామె. ఉన్నతాధికారులు ప్రోత్సాహకంగా విసిరిన ఛాలెంజ్ ను సాహసోపేతంగా స్వీకరించి విజయం సాధించింది. ఆమె ఛేదించిన అసాధారణ లక్ష్యానికి ఫలితంగా అసాధారణ పదోన్నతి పొందింది. ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఓ సాధారణ హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకా ఈ ఘనత సాధించింది. ఇంతకీ ఆమె సాధించిన లక్ష్యం ఏమిటంటారా? చిన్నదేమీ కాదు. ఢిల్లీ, పంజాబ్, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో కనిపించకుండా పోయిన 76 మంది పిల్లల ఆచూకీని గుర్తించింది. ఇందుకు బహుమతిగా ఉన్నతాధికారుల నుంచి సీమా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ పొందింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా పోలీస్ ఆమె కావడం విశేషం.

ఇంటి నుంచి తప్పిపోయిన చిన్నపిల్లలను అన్వేషించే టాస్క్ లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఈ ఏడాది ఆగస్టులో పోలీసులకు ఓ ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించారు. ‘ఎవరైనా కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ తప్పిపోయిన 14 ఏళ్ల లోపు పిల్లలను 50 మందిని గానీ, అంతకంటే ఎక్కువ మందిని గానీ గుర్తించగలిగితే వారికి సీనియారిటీతో సంబంధం లేకుండానే ప్రమోషన్ ఇస్తామన్నది’ ఆ పథకం సారాంశం. ఇందుకోసం 12 నెలల గడువు విధించారు. ఈ పథకం పోలీసులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు సుమారు 1400 మంది పిల్లల ఆచూకీని గుర్తించగలిగారు. అత్యధికంగా 76 మంది పిల్లల ఆచూకీని కనుగొన్న సీమాకు అసాధారణ పదోన్నతి లభించింది. కేవలం రెండున్నర నెలల్లోనే ఆమె ఎంతో శ్రమకోర్చి ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పిల్లల ఆచూకీని గుర్తించింది. తద్వారా వారి తల్లితండ్రుల మోముల్లో ఆనందాన్ని నింపగలిగింది. శభాష్ సీమా.

Leave a Reply