హైద్రాబాద్ : గత ఏడాది డిసెంబరులో హైద్రాబాద్లో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనానికి కారణమైందో.. తాజాగా జరిగిన ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్ కూడా అదేస్థాయిలో సంచలనం, చర్చనియాంశమైంది. ఇవి రెండూ వేర్వేరు రాష్టాలలో వేర్వేరు పోలీసులచే జరిగినవే అయినా ఈ రెండిటినీ ఒకదానితో ఒకటి పోల్చడంతో హైదరాబాద్ ఎన్కౌంటర్ మరోమారు జాతీయస్థాయిలో చర్చకు కారణమవుతోంది. యువ పశువైద్యురాలిని అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన నలుగురు నిందితులను హైద్రాబాద్ పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపగా.. తనను అరెస్టు చేయడానికి వచ్చిన 9 మంది పోలీసులను అత్యంత క్రూరంగా అంతమొందించిన వికాస్ దూబే లఖ్నవ్ పోలీసుల తూటాలకు నేలకొరిగాడు. ఈ రెండు సంఘటనలను పోల్చుతూ ఎక్కువమంది నెటిజన్లు వ్యాఖ్యానాలు చేస్తుండగా.. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే సైతం జులై-20న జరిగిన ఓ విచారణ సందర్భంగా స్పందించడంతో హైద్రాబాద్ ఘటన దేశ రాజధానిలోనూ మరోసారి చర్చకు వచ్చింది. హైద్రాబాద్ ఎన్కౌంటర్, వికాస్ దూబే ఎన్కౌంటర్ ఒకే లాంటివి కాదని, రెండిటి మధ్య చాలా అంతరం ఉందని పేర్కొన్నారు. ఒక మహిళ పాశవిక హత్య కేసులో పోలీసుల అదుపులో ఉన్న నలుగురి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని, దూబే విషయం అలాంటిది కాదని వివరించారు. సీజేఐనే కాదు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా హాజరైన ఉత్తరప్రదేశ్ డిజిపి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం హైదరాబాద్లో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ ను తమ వాదనల్లో ప్రస్తావించారు. పోలికలు ఎలా ఉన్నా అత్యధికులు వ్యక్తపరిచే అభిప్రాయం ఒకటే “సత్వర న్యాయం” జరిగిందని.