
ఉజ్జయిన్ : నేరస్తుల సమాచారాన్ని పొందాలన్న లక్ష్యంగా వారిపై పోలీసులు నగదు బహుమతులు (రివార్డులు) ప్రకటిస్తుంటారు. నేరస్థుడి స్థాయి, సీనియారిటీ, చేసిన నేరాల ఆధారంగా ఈ రివార్డు పెరుగుతూ పోతుంది. నగదు బహుమతి ఎంత ఎక్కువగా ఉంటే నేరస్తులను అంత త్వరగా పట్టుకోవచ్చన్న భావనతో పోలీసులు వీటిని ప్రకటిస్తుంటారు. ఇదే ఆలోచనతో 9 మంది పోలీసులను హతమార్చిన యుపి గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే పైనా పోలీసులు రూ. 5లక్షల రివార్డును ప్రకటించారు. అతడు దొరికాడు, పోలీసుల ఎన్కౌంటర్ లో అంతం కూడా అయిపోయాడు. కాని ఈ రివార్డు సొమ్ము ఎవరికి చెందాలన్న విషయంపై ఎన్కౌంటర్ ని మించిన కసరత్తే సాగుతోంది. దూబేని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇతడికి సంబంధించిన సమాచారం ఎవరిచ్చారు.? ఎలా ఎవరికి తెలిపాడు..? అతడి వివరాలు ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంపీ పోలీసులకు లేఖ రాశారు. పేరు పేర్కొంటే రూ. 5లక్షల ఇస్తామని చెప్పారు. దీంతో ఇది ఎవరికి చెందాలన్న విషయంపై ఎంపీ పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. సమాచారం ఎవరిచ్చారన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో ఈ అంశాన్ని తేల్చేందుకు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లతోకూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాల్చి వచ్చింది. అదనపు ఎస్పీలు అమరేంద్ర సింగ్, రూపేష్ ద్వివేదీ, ఆకాశ్ భురియలతో కూడిన బృందం విచారణ జరిపి రివార్డుకు ఎవరు అర్హులో తేలుస్తుందని ఉజ్జయిన్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ గురువారం తెలిపారు. ఇంత తతంగం చూస్తుంటే అసలైన సమాచారం ఇచ్చినవారికి ఈ మొత్తం దక్కుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎవరు సమాచారమిచ్చారన్న వారి వివరాలు లేకపోవడంతోనే ఇదంతా నడుస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.