పసిపిల్లల విషయంలో తస్మాత్ జాగ్రత్త

0
358

ఎన్ని పనులు ఉన్నా తల్లిదండ్రులు పసిపిల్లలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని, లేకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదనే విషయాన్ని తాజాగా జరిగిన రెండు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో జరిగిన ఆ ఘటనల వివరాల్లోకి వెళ్తే… కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరెల్ తండాకు చెందిన బామన్ జగదీశ్, సీతాబాయి దంపతుల 18 నెలల పసిబాలుడు శ్రీగోపాల్ బుధవారం సాయంత్రం బంతితో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఒంటరిగా ఆడుకుంటున్న పసిబాలుడు అక్కడే ఉన్న నీళ్ల బకెట్ దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో తల్లకిందులుగా పడిపోయాడు. ఆ బకెట్లో సగానికి నీళ్లు ఉండటంతో అందులో తలమునిగి ఊపిరాడక మరణించాడు. కొంతసేపటికి ఇంట్లో నుంచి ఆవరణలోకి వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లవాడు కనిపించక ఆందోళన చెందారు. ఆ ప్రాగణమంతా వెతకగా నీళ్ల బకెట్ లో శవమై కనిపించాడు.

పసికందుపై నక్క దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని గిరిజన గ్రామం పల్లె రాళ్లచెలక. దట్టమైన అడవి ప్రాంతంలోని ఈ గిరిజన గ్రామానికి చెందిన ముక్తి యడమ, రాధ దంపతులకు మూడు నెలల మగబిడ్డ ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆ పసికందుని పూరింటి వసారాలో చీరతో కట్టిన ఊయలలో నిద్రపుచ్చారు. కొద్దిసేపటి తర్వాత పిల్లాడు పెద్దగా ఏడ్వటం వినిపించడంతో భార్యభర్తలు ఇంట్లో నుంచి వసారాలోకి వచ్చారు. అప్పటికే పసికందును నోట కరచుకుని వెళ్తున్న నక్క కనిపించడంతో దిగ్ర్బాంతికి గురై పెద్దగా కేకలు వేశారు.  దీంతో పది అడుగుల దూరంలో పసికందుని వదిలేసి ఆ నక్క పరారైంది. నక్క దాడిలో పిల్లాడి ముఖం, తలభాగంలో తీవ్రగాయాలైన  చిన్నారిని పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుమారు 2గంటలు పాటు శ్రమించి చిన్నారికి వైద్యులు చికిత్సలు అందించారు. ప్రాణాపాయం లేదని తేల్చారు.

Leave a Reply