పెళ్లంటాడు.. డబ్బులు దండుకుంటాడు

0
244

నకిలీ మేజర్ ఎంఎన్ చౌహాన్

పెళ్లి కుమారుడి విషయంలో లోతుగా విచారించకుండా పైపై డాబులు చూసినా, పైపైమాటలు నమ్మినా ఎంతగా నష్టపోవాల్సి వస్తుందో చెప్పే ఘటన ఇది. ఇంతకీ విషయమేమిటంటే.. ముదావత్ శ్రీను నాయక్ అనే వ్యక్తిని హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. నిందితుడి గురించి వారు వెల్లడించిన వివరాలు విస్మయం కలిగించాయి. ప్రకాశం జిల్లా పలుకురాళ్ల తండాకు చెందిన నిందితుడు పదో తరగతి వరకు మాత్రమే చదివాడు. 2002లో అదే ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకోగా ఆమె గుంటూరులోని డీఎంహెచ్ వో కార్యాలయంలో సూపరిటెండెంట్ గా పనిచేస్తున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. కొన్నిరకాల వైద్య కోర్సులు చేసేందుకు శిక్షణ కోసం నగరానికి వచ్చిన నిందితుడు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. డబ్బు కోసం మోసాలబాట పట్టాడు. ఏకంగా ఆర్మీ మేజర్ అవతారమెత్తాడు. ఎంఎస్ చౌహాన్ పేరిట నకిలీ ఐడీ కార్డు సృష్టించి ఆర్మీ దుస్తులతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేశానని, ఐఐటీ మద్రాసు పట్టభద్రుడినని ప్రచారం చేసుకున్నాడు.

ధనవంతుల కుటుంబాలే లక్ష్యం

తమ కుమార్తెల కోసం వరుడిని అన్వేషించే ధనవంతుల కుటుంబాలే నిందితుడి లక్ష్యం. మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా తమ సామాజిక వర్గానికి చెందిన ధనవంతులైన అవివాహిత యువతల వివరాలు సేకరించి ఖరీదైన కార్లలో పెళ్లి చూపులకు వెళ్లేవాడు. కట్నకానుకలు వద్దని నమ్మించేవాడు. తను అద్దెకు తీసుకున్న గదిని ఆర్మీ దుస్తువులు, వస్తువులతో అలంకరించి ఆర్మీ మేజర్ ఉండే నివాసాన్ని తలపించేలా  చేశాడు. ఇక్కడి నుంచే తరచూ పెళ్లి చూపులు చూసి కుటుంబాలతో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడి అప్రయత్నంగానే వారిని నమ్మించాడు. పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత వివిధ కారణాలతో డబ్బు అవసరం ఉందంటూ లక్షల రూపాయలు కొట్టేసేవాడు. ఇలా ఓ ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి రూ.56 లక్షలు, సచివాలయ ఉద్యోగి నుంచి రూ.52 లక్షలు, పీజీ పూర్తి చేసిన యువతి నుంచి రూ.70లక్షలు, ఎంబీఏ పూర్తిచేసిన వరంగల్ కు చెందిన ఓ యువతి కుటుంబం నుంచి రూ.2.01 కోట్లు తీసుకున్నాడు. మొత్తం 17 మందిని మోసం చేసి రూ.8.25 కోట్లు కాజేశాడు. ఐఐటీ ఖరగ్ పూర్ లో ఐఐటీ చేసిన యువతిని పెళ్లి పేరుతో నమ్మించడానికి యత్నించగా ఆమె ఆరా తీయడంతో బంఢారం బయటపడింది. నిందితుడు కొనుగోలు చేసిన సైనిక్ పురిలోని ఓ విల్లా, మూడు ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి ఆదివారం వరంగల్ యువతితో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ముందు రోజే అరెస్టు కావడం గమనార్హం. ఐటీ కట్టాల్సి ఉందని భార్యనూ నమ్మించి రూ.16 లక్షలు తీసుకోవడం కొసమెరుపు.

Leave a Reply