బంగారం ఆశ చూపి బంగారాన్నే కొట్టేశాడు

0
252


ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ మేనేజర్ ఘరానా మోసం

మోసగాళ్లు పలు రకాలుగా వంచనకు పాల్పడుతున్నా అందుకు వారు వాడే ఏకైక సూత్రం ఆశ. ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలను తమ బుట్టలో పడేలా చేసుకుని తర్వాత మోసాలకు పాల్పడుతుంటారు. ఏ తరహా మోసాన్ని పరిశీలించినా ఈ విషయాలే కనిపిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈ తరహా మోసమే వెలుగులోకి వచ్చింది. పటమటలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్న వీరబాబు ఈ తరహా మోసానికే పాల్పడ్డాడు. సంస్థతో సంబంధంలేకుండా ఓ గోల్డ్ స్కేమ్ పెట్టాడు. ఆ స్కీమ్ ద్వారా బంగారం డిపాజిట్ చేస్తే ఒక గ్రాము బంగారు నాణం ఉచితంగా ఇస్తామంటూ కస్టమర్లను నమ్మించాడు. దీంతో పటమట తోటవారి వీధికి చెందిన సౌమ్య అనే మహిళ 300 గ్రాముల ఆభరణాలను డిపాజిట్ చేశారు. ఇలా మరికొందరు కూడా తమ ఆభరణాలను డిపాజిట్ చేశారు. ఈ నేపథ్యంలో వీరబాబు బదిలీ కావడంతో ఆ ఫైనాన్స్ సంస్థకు కొత్తగా వచ్చిన మేనేజర్ ను తమ డిపాజిట్లు గురించి సౌమ్య విచారించారు. సంస్థలో అలాంటి స్కీమ్ ఏమీలేదని ఆయన చెప్పడంతో వీరబాబు మోసం బయటపడింది. దీంతో ఆమె గురువారం పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో మరికొందరు బాధితులు ఉన్నారని తెలిసింది. బంగారు నాణం పేరుతో మొత్తం 2.750 కిలోల ఆభరణాలను వీరబాబు కొట్టేశాడని తేలింది. మరో ముగ్గురికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందని తెసింది. దీంతో వీరబాబు సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరబాబు ప్రస్తుతం సంస్థకు చెందిన తమిళనాడులోని ఓ శాఖకు బదిలీయైనట్లు సమాచారం.

Leave a Reply