31 రౌడీషీటర్లకు హైదరాబాద్‌ సీపీ కానుక

0
212


సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల పేరిట ఉన్న రౌడీషీట్లను హైదరాబాద్‌ పోలీసులు తొలగించారు. పాతబస్తీ, సౌత్ జోన్‌లో మొత్తం 636 రౌడీషీట్లు ఉండగా వారిలో 31 మంది రౌడీషీటర్ల పేరిట దశాబ్ద కాలానికి పైగా ఉన్న షీట్లను తొలగించినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రకటించారు. ఆగస్టు-3న సాలార్‌జంగ్‌ మ్యూజియం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన రౌడీషీట్లు తొలగించిన వారికి కొన్ని సూచనలు జారీ చేశారు. జోన్ల వారీగా సాగుతున్న రౌడీషీట్ల తొలగింపు మేళా సౌతజోన్‌ నుంచి ప్రారంభమైంది. క్రమంగా నార్త్‌, ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌ జోన్‌లోనూ కొనసాగుతోందని వివరించారు. రౌడీషీట్‌ ఉన్పప్పటికీ గత కొన్నేళ్లుగా ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, ఎలాంటి తప్పు చేయకుండా సత్ప్రవర్తనతో ఉన్న వారి రౌడీషీట్లు తొలగించారు. గతంలో తప్పులు చేసి జైళ్లకు వెళ్లి శిక్షలు అనుభవించారు. క్రమంగా వారిలో మార్పు వచ్చినందున సమాజంలో గౌరవంగా బతికే హక్కు వారికీ ఉందని సీపీ అన్నారు. అందుకే అలాంటి వారి పేర్లు పోలీసు రికార్డుల నుంచి తొలగించి కొత్త జీవితం జీవించే అవకాశం కల్పిస్తున్నామన్నారు. రికార్డుల నుంచి పేర్లు తొలగించినప్పటికీ.. మళ్లీ తప్పులు చేస్తే మళ్లీ చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. తీరు మార్చుకున్న పాతవారి రౌడీషీట్లు తొలగించినట్టే… కొత్త వారెవరైనా నేరాల బాట పడితే వారిపై కొత్త రౌడీషీట్లు తెరుస్తామని కూడా హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సత్ప్రవర్తనతో మెలిగిన మాజీ రౌడీషీటర్లతో పాటు అదనపు సీపీలు డీఎస్‌ చౌహాన్‌, జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి, సౌత్ జోన్‌ డీసీపీ గజరావు భూపాల్‌, అదనపు డీసీపీ (సౌత్) రఫీక్‌ తదితరులు హాజరయ్యారు. రౌడీషీటర్ల పేర్లు తొలగించడానికి గత మూడు నెలల నుంచి వివిధ జోన్లలో కసరత్తు సాగుతోందని.. లా అండ్‌ ఆర్డర్‌, స్పెషల్‌ బ్రాంచి, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా పేర్లు తొలగించామని సీపీ వివరించారు. సౌత్ జోన్‌లో మొత్తం 636 రౌడీ షీటర్లుండగా… వారిలో 31మంది పేర్లు తొలగించారు. కొన్నేళ్లుగా నేరాలకు పాల్పడలేదని.. ఆరోపణలేమీ లేని వారిని గుర్తించి అవకాశం కల్పించామని సీపీ అన్నారు. వారి కొన్నేళ్ల చరిత్ర ఆధారంగా వారిపై నమ్మకంతో రౌడీషీట్లు తొలగించామని.. అదే నమ్మకంతో భవిష్యత్తులో వారు మెలుగుతారని సీపీ ఆ శాభావం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో తప్పులు జరుగుతాయి.. వాటిలో చిన్నవి, పెద్దవీ ఉంటాయి. కొన్ని నేరాలు కూడా జరుగుతుంటాయి. నేరం చేసిన వారికి జీవితాంతం శిక్ష ఉండటం సమంజసం కాదని.. వారికీ సమాజంలో గౌరవంగా బతికే అ వకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నేరాల బాట వీడినందున భవిష్యత్తులో కష్టార్జనతో… సక్రమ దారిలో నడుస్తూ జీవితం గడిపి తమ వ్యక్తిత్వాన్ని చాటి చెప్పాలని సీపీ వారితో అన్నారు. ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. ఇక ముందు ఇతరులు చూసి వారి మంచితనాన్ని గుర్తించే విధంగా కష్టపడి జీవితం సాగించాలని వారితో అన్నారు.

Leave a Reply