పుల్వామా దాడులపై 5 వేల పేజీల ఛార్జిషీట్

0
179

న్యూఢిల్లీ; కాశ్మీరులో సుమారు ఏడాదిన్నర కిందట జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడులు గుర్తున్నాయా? సుమారు 40 మంది మృతికి కారణమైన ఈ దాడులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏకంగా 5 వేల పేజీల ఛార్జిషీట్ ను సిద్ధం చేసింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైష్-ఎ-మహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్, అతని సోదరుడు రవూఫ్ అస్గర్ ఈ దాడికి ప్రధాన సూత్రధారులని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో 2019 ఫిబ్రవరి 14న భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద పుల్వామా జిల్లా లేథిపురా వద్ద పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఉగ్రవాదులు దాడి చేశారు. అదిల్ అహ్మద్ దార్ అనే ఉగ్రవాదిని ఆత్మాహుతి బాంబర్ గా ఉపయోగించిన ఈ దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్ మరణించారు. దాడి చేసింది తామేనని జైష్-ఎ-మహమ్మద్ అప్పట్లోనే ప్రకటించుకుంది.

ఎన్ఐఏ ఛార్జిషీట్లో మొత్తం 20 మంది నిందితుల పేర్లున్నాయి. దాడులకు ప్రణాళిక, అమలు ఎలా సాగాయనే వివరాలు ఇందులో వివరించారు. నిందితుల కాల్ రికార్డింగులు, వాట్సాప్ ఛాట్స్, ఆర్డీఎక్స్ తదితర పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న ఫొటోలు జత చేశారు. పుల్వామా దాడుల అనంతరం భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందిన నిందితుల్లో
ఒకరైన ఉమర్ ఫరూఖ్ ఫోన్లో ఈ ఫొటోలు లభ్యమయ్యాయని సమాచారం. దాడి విజయవంతం కావడాన్ని ప్రశంసిస్తూ, ప్రధాన నిందితుడు మసూద్ అజహర్ సహచరులకు పంపిన ఆడియో, వీడియో క్లిప్పింగులు కూడా ఛార్జిషీట్లో జోడించబడ్డాయి. జైష్-ఎ-మహమ్మద్ టెలిగ్రాం గ్రూపులో దాడులకు సంబంధించిన వివరాలు కూడా ఎన్ఐఏ సేకరించింది. మసూద్ అజహర్ ముంబైపై జరిగిన 26/11 దాడులు సహా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి కీలక నిందితుడిగా భారతదేశ ‘వాంటెడ్’ లిస్టులో ఉన్నాడు.

ఇతర కీలక నిందితులు… అభియోగాలు
ఉమర్ ఫరూఖ్; జైష్ కమాండర్. దాడికి ఉపయోగించిన బాంబును అమర్చింది, దాడి అమలును పర్యవేక్షించిందీ ఇతడే. ఈ ఏడాది మార్చిలో ఉమర్, బాంబు తయారీలో నిపుణుడైన కమ్రన్ ఇద్దరూ గత మార్చిలో జరిగిన ఎన్ కౌంటర్లో మరణించారు.

షకీర్ బషీర్ మాగ్రీ; దాడికి ఉపయోగించిన కారును ఇతడే నడిపాడని అభియోగం. కానీ దాడి ప్రదేశానికి అర కిలోమీటరు ముందే తప్పించుకున్నాడు. ఈ కామర్స్ వెబ్ సైట్ నుంచి గ్లౌజులు, బ్యాటరీ, అమ్మోనియం పౌడర్ కొనుగోలు చేయడంలో ఇతడి పాత్ర ఉంది. దాడి ప్రదేశానికి సమీపంలో ఇతడు ఫర్నిచర్ షాపు నడుపుతున్నాడు. భద్రతా దళాల కాన్వాయ్ కదలికలను ఇతడు నిశితంగా గమనించి ఉమర్, అదిల్ అహ్మద్ లకు సమాచారమిచ్చాడు.

మహ్మద్ ఇక్బాల్ రాథర్; పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదులను కాశ్మీరుకు తీసుకురావడానికి బుడ్గాంకు చెందిన పాతికేళ్ల ఈ యువకుడు రవాణా సౌకర్యం కల్పించాడని అభియోగం. ఇతడిని జులైలో ఎన్ఐఏ అరెస్టు చేసింది. బిలాల్ అహ్మద్ కుచీ; జైష్ కు అత్యాధునిక మొబైల్ ఫోన్లు సమకూర్చాడు. వీటిలోని ఫోన్ తోనే దాడి దృశ్యాలను దగ్గరగా వీడియో తీశారు.

Leave a Reply