అనుమానంతో భార్య గొంతుకోసి….

0
121

హైదరాబాద్‌: అనుమానంతో భార్య గొంతుకోసి హతమార్చిన సంఘటన పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జల్‌పల్లి, శ్రీరామ్‌నగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న నాగరాజు (32) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వరలక్ష్మి (26) అనే యువతితో ప్రేమవివాహం చేసుకున్నాడు. వారికి ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. 6 నెలల పాటు సజావుగానే సాగిన వారి సంసారంలో… ఆ తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర కాలంగా తరచూ భార్యను అనుమానిస్తున్న భర్త సోమవారం ఆమెను హతమార్చి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం 11గంటల వరకు వరలక్ష్మి తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానించిన స్థానికులు సమీపంలో ఉండే ఆమె తల్లి పద్మకు సమాచారం ఇచ్చారు. కూతురి ఇంటికి చేరుకున్న తల్లి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో కూతురి మృతదేహం పడి ఉంది. వెంటనే పహాడిషరీఫ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. భార్యను ఆమె భర్త నాగరాజు హత్య చేసి పారిపోయి ఉంటాడని తల్లి అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో కత్తితో గొంతు కోసి హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లయిన కొన్ని నెలల తర్వాత నుంచి గొడవలు ప్రారంభమయ్యాయని… అప్పటి నుంచి ఆమె భర్త ఆమెను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు ఆమెను తీవ్రంగా కొట్టేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పహాడిషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం భర్త నాగరాజు పరారీలో ఉన్నాడని అతనికోసం రెండు బృందాలు గాలిస్తున్నాయని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Leave a Reply