ఏటీఎంలలో డిపాజిట్‌ చేయాల్సిన డబ్బుల గోల్‌మాల్‌

0
263


హైద‌రాబాద్ : ఏటీఎం సెంటర్లలో క్యాష్‌ డిపాజిట్లు చేసే సిబ్బంది తమ హస్త లాఘవాన్ని ప్రదర్శించి ఆ డబ్బును మళ్లించేశారు. ఏకంగా కోటి 23 లక్షల రూపాయలు దారి మళ్లాయి. సంబంధిత అధికారులు సెంట్రల్‌ క్రైం ‌ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఒకే రూట్‌లో పని చేస్తున్న టీమ్‌ వివిధ సందర్భాల్లో మొత్తం రూ. 1.23కోట్ల రూపాయలు కాజేసినట్లు సెక్యూర్‌ వ్యాల్యూ ఇండియా ప్రైవేటు సంస్థ తమ ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. సంస్థ నిర్వహించిన ఆడిటింగ్‌లో క్యాష్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌కు సంబంధించిన అంశాలు బయట పడ్డాయి. దీంతో సెక్యూర్‌ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస రావు జూలై 17న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం యంత్రాలలో డబ్బు డిపాజిట్‌ చేసే కాంట్రాక్ట్‌తో పాటు క్యాష్‌ మేనేజ్మెంట్‌ తదితర సర్వీసులను సెక్యూర్‌ వ్యాల్యూ ఇండియా సంస్థ నిర్వహిస్తోంది. సర్వీసెస్‌లో భాగంగా కొన్ని బాధ్యతలను నిర్వహించడానికి బి టి ఐ పేమెంట్‌ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. 36 ఏటీఎం సెంటర్లలో నగదు డిపాజిట్‌ చేసే పనిని బి టి ఐ కి అప్పగించారు. ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్‌ చేసేందుకు కొంతమంది కస్టోడియన్లను నియమించి వారికి ఏటీఎం తాళాలు, పాస్‌ వర్డులు అప్పగించారు. నలుగురు సభ్యులున్న ఓ టీమ్‌ కస్టోడియన్లుగా ఉన్న రూట్‌ నుంచి రిపోర్టు రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు ఆడిటింగ్‌ నిర్వహించారు. ఈ ఆడిటింగ్‌ లో రూ. 1.23 కోట్ల నగదు దారి మళ్లినట్లు గుర్తించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిసిఎస్‌ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Leave a Reply