బిట్‌కాయిన్‌ పేరిట 52కోట్ల రూపాయల మోసం

0
179


బిట్‌కాయిన్‌ పేరిట దేశవ్యాప్తంగా వేల మందిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు సిరిమల్ల నాగరాజును హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. బిట్‌కాయిన్‌ పేరిట ఆన్‌లైన్‌ దందా చేసిన సిరిమల్ల నాగరాజు తెలంగాణ రీజియన్‌కు హెడ్‌గా వ్యవహరించాడు. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే 18వారాల్లో అధిక మొత్తాల లాభాలతో తిరిగి చెల్లిస్తానని నమ్మించి పలువురిని నట్టేట ముంచాడు. బైనరీ పద్ధతి (గొలుసు స్కీము)లో దేశవ్యాప్తంగా సుమారు 1200 మంది నుంచి రూ. 52కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడి ఉంటాడని పోలీసులు గుర్తించారు. తెలంగాణలో 250 మంది బాధితుల వద్ద నుంచి రూ. 10కోట్ల వరకు వసూలు చేసి ఉంటాడు. బొల్లారపు రామకృష్ణ మరి కొంతమంది మోసపోయిన తీరును వివరిస్తూ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రధాన నిందితుడు నాగరాజును అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో లింకు అయి ఉన్న మరికొంతమంది పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
సిరిమల్ల నాగరాజు మరి కొందరు కలిసి నాలుగు వెబ్‌సైట్లు తయారు చేశారు. రాస్‌నెఫ్ట్‌హెడ్జ్‌ఫండ్‌.రు, ఆర్‌హెచ్‌ఎఫ్‌కాయిన్‌.కామ్‌, ఆర్‌హెచ్‌ఎఫ్‌గోల్డ్‌.కామ్‌, యూరెస్‌కాయిన్‌.కామ్‌ పేరిట వెబ్‌సైట్లు సృష్టించి ఆన్‌లైన్‌ బిట్‌కాయిన్‌ దందా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రీజియనల్‌ హెడ్స్‌, ఇతర ఏజెంట్లను నియమించారు. బిట్‌కాయిన్‌లో 18 వారాలకు పెట్టుబడులు పెడితే ప్రతి వారం ఆన్‌లైన్‌ ద్వారా అకౌంట్లలోకి లాభాలు వస్తాయని బాధితులను నమ్మించారు. వారి మాట నమ్మిన అమాయక బాధితులు భారీగా పెట్టుబడులు పెట్టారు.

Leave a Reply