అభినవ ‘డాన్‌’
12 రాష్ట్రాల పోలీసుల గాలింపు
100కు పైగా భారీ కార్ల తస్కరణ

0
266


హైదరాబాద్‌: డాన్‌ సినిమా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అందులోని ‘డాన్‌ కో పకడ్‌నా ముష్కిల్‌ హీ నహీ.. నా ముమ్కిన్‌ హై’ (డాన్‌ను పట్టుకోవడం కష్టమైన పని మాత్రమే కాదు.. అసాధ్యం కూడా) అనే డైలాగ్‌ చాలామందికి గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి డైలాగ్‌నురిపీట్‌ చేస్తూ దేశంలోని సగం రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అభినవ డాన్‌ను పట్టుకోవడం అసాధ్యంగా మారింది. ఓపెన్‌ ఛాలెంజ్‌ చేసినా అతని వద్దకు చేరుకోలేని నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో పాలుపోక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అనుభవంలో తలలు పండిన పోలీసు అధికారులు. టెక్నాలజీలో విదేశాలతో పోటీ పడుతున్న సైబర్‌ పోలీసింగ్‌ అయినా ఆ ఒక్కణ్ని పట్టుకోవడం దుర్భరంగా మారుతోంది. పోలీసులకు ఛాలెంజ్‌ చేసి తాను ఫలానా చోట ఉన్నానని చెప్పినా… అతని వద్దకు చేరుకునే లోగా తప్పించుకునే నైపుణ్యం… తనను పట్టుకోలేరంటూ ఓపెన్‌ ఛాలెంజ్‌ చేయడం అతని నైజం. అయినా ఎప్పుడో ఓ సారి అతన్ని తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు మాత్రం దీమా వ్యక్తం చేస్తున్నారు. ఎంబీఏ వరకు చదివి… ఆధునిక టెక్నాలజీని సొంతం చేసుకున్న ఆ వ్యక్తికి ఉన్న వ్యసనం మాత్రం ఖరీదైన కార్లు తస్కరించి వాటిని విక్రయించి జల్సాలు చేయడం. చోరీ చేసిన కారులో ఎలాంటి నేరానికైనా పాల్పడే ఆస్కారమున్నందున… అతను చేసిన నేరాల చిట్టా కూడా పోలీసులు గుర్తించ లేక పోతున్నారు. ఇప్పటికే చోరీ చేసిన కార్లలో డ్రగ్స్‌ తరలించాడనే ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి. అతను చిక్కితేనే తప్ప అతని నేరాల చిట్టా బయటపడే అవకాశం లేదని అధికారులే ఒప్పుకుంటున్నారు.
రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌ నగరానికి చెందిన సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ (40) ఎంబీఏ పూర్తి చేశాడు. తనకున్న తెలివితేటలను నేరాల బాటలో వినియోగించాడు. 27వ ఏటనే తొలిసారిగా కారు తస్కరించడం ప్రారంభించి ఇప్పటి వరకు 100కి పైగా ఖరీదైన కార్లను తస్కరించాడు. పలు రాష్ట్రాల్లో అరెస్టు అయ్యాడు. బెయిల్‌పై విడుదల కావడం.. మళ్లీ కారు తస్కరించడం అతని హాబీగా మారిపోయింది. చైనా నుంచి కీ డేటా సాఫ్ట్‌వేర్‌ను తెప్పించుకున్న షెకావత్‌ సునాయాసంగా ఖరీదైన కార్లను చోరీ చేయసాగాడు. తన వద్ద ఉన్న సాఫ్ట్‌వేర్‌ సాయంతో కార్ల తాళం చెవి సాఫ్ట్‌వేర్‌ను కోడ్‌ చేసి నకిలీ తాళం సృష్టిస్తాడు. పార్కు చేసి ఉన్న కారును జీపీఎస్‌ అమర్చి.. కారు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత సీసీ కెమెరాలు లేని ప్రాంతాన్ని గుర్తించి పార్క్‌ చేయగానే కారును తస్కరించి తన సొంత రాష్ట్రానికి పారిపోతాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, నాచారం పోలీస్‌ స్టేషన్లలో రెండు కేసులు నమోదయ్యాయి. గతంలో అతన్ని పట్టుకోడానికి బంజారా హిల్స్‌ పోలీసులు వెళ్లగా వారికి ఎదురైన అనుభవమే నాచారం పోలీసులుకు ఎదురైంది.
గతంలో బంజారాహిల్స్‌ పోలీసులు అతన్ని పట్టుకోడానికి జైపూర్‌ వెళ్లగా… ‘నన్ను పట్టుకోలేరు’ అని ఛాలెంజ్‌ విసిరాడు. కేవలం ఇంటర్నెట్‌ వాయిస్‌ మాత్రమే మాట్లాడుతాడు. ఎలాంటి ఫోన్‌ వాడడు. కనీసం ఫోన్‌ వాడినా పోలీసులు అతన్ని ఇట్టే పట్టేసే అవకాశమున్నా… అన్ని జాగ్రత్తలు తీసుకుని తప్పించుకుంటున్నాడు. అప్పట్లో వెళ్లిన బంజారాహిల్స్‌ పోలీసులకు అతను సవాల్‌ విసురుతూ… ‘‘ఎలాగూ ఇంతదూరం వచ్చినందుకు లంచ్‌చేసి వెళ్లండని’ ఉచిత సలహా కూడా ఇచ్చేశాడు. 3 రోజుల క్రితం నాచారం పోలీసులు కూడా ఫిర్యాదు ఆధారంగా అతన్ని పట్టుకోడానికి జైపూర్‌ వెళ్లారు. అతనింట్లో లేకపోగా… భార్య కనిపించడంతో ఆమెకు పోలీసులు నోటీసులు అందించారు. అదే సమయంలో ఇంటర్నెట్‌ కాల్‌ చేసిన షెకావత్‌ పోలీసుల పరువు తీశాడు. ‘టెక్నాలజీలో మీకన్నా ముందున్నానని, ప్రస్తుతం తాను బెంగళురులో ఉన్నానని చెప్పడంతో వెనుదిరిగారు.

Leave a Reply