
హైదరాబాద్: తోటి వ్యాపారి వ్యాపారానికి సంబంధించిన కేసులు మాఫీ చేస్తానని… అరెస్టు అయిన వ్యాపారి సోదరుడిని విడుదల చేయిస్తానని లైసెన్సుడ్ ఎక్స్‌ప్లోజివ్స్ వ్యాపారి వద్ద నుంచి రూ. 3.6కోట్లు కాజేశాడు. అంతే కాకుండా అధిక డబ్బులు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడటంతో బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పుణే నివాసి కపిల్ రాజేంద్ర కుమార్ బాహెతీ అలియాస్ కపిల్ తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్రల్లో పేలుడు పదార్థాల తయారీ వ్యాపారం చేస్తుంటాడు. హైదరాబాద్‌కు చెందిన సోదరులు ఏ. విజయ్‌కుమార్, ఏ. రాజ్‌కుమార్‌లు ఇక్కడే ఉంటున్నారు. అనుమతి లేకుండా 10టన్నుల అమ్మోనియాను తరలిస్తున్నాడనే కారణంతో 2019లో రాజ్‌కుమార్‌ను ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. వారితో పాత పరిచయమున్న కపిల్ ఈ వ్యవహారంలో దూరిరాజ్కుమార్ను విడుదల చేయించడానికి కోటి రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పాడు. నమ్మిన బాధితుడు నిందితుని ఆదేశాల మేరకు తొలుత రూ. 60లక్షలు హవాలా ఏజెంటు ద్వారా చెల్లించాడు. కేసును క్లోజ్ చేయడానికి… సీనియర్ పోలీసు అధికారులను మేనేజ్ చేయాల్సి ఉంటుందని… అదనంగా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. అతన్ని నమ్మడంతో పాటు భయాందోళనల్లో ఉన్న బాధితుడు విజయ్‌కుమార్ మరో రూ. 1.50కోట్లు చెల్లించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆగకుండా వరసగా ఓ సారి రూ. 20లక్షలు, మరోసారి రూ. 15లక్షలు చెల్లించాడు. ఓ సోదరుడి అరెస్టుతో పాటు వివిధ పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసుల గురించి తెలుసుకున్న కపిల్ అమాయకులైన సోదరులను మోసం చేస్తూనే ఉన్నాడు. సోదరుడి అరెస్టు, రిమాండ్ నుంచి బెయిల్ ఇప్పించడమే కాకుండా కేసులు మాఫీ చేయిస్తానని నమ్మించాడు. కేసుల తీవ్రత చూపి వారిని బెదిరించాడు. మేనేజ్ చేయకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని భయాందోళనలకు గురి చేశాడు. అంతా మేనేజ్ చేస్తానని నమ్మించి… దానికోసం భోన్గిరి, ఇతర రాషా్ట్రల్లోనూ కేసులకు సంబంధించి రూ. 35లక్షలు, రూ. 25లక్షలు డిమాండ్ చేశాడు. ఓ కేసుకు సంబంధించి రూ. 35లక్షలు చెల్లించిన తర్వాత అప్పుడు కపిల్ వ్యవహారంపై అనుమానంతో రూ. 25లక్షలు ఇవ్వలేదు. అప్పటికే నిందితుడు మొత్తం రూ. 3.6కోట్లు తీసుకున్నాడు. నిందితుడి గురించి తెలుసుకున్న బాధితులు అతనికి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించగానే బెదిరింపులు తీవ్రం చేశాడు. కేసులు బుక్ చేయిస్తానని ఇతర సెక్షన్ల కింద వ్యాపారానికి దెబ్బ తీస్తానని బెదిరించాడు. చివరకు బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు పుణేకు ప్రత్యేక బృందాన్ని పంపించి… నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.