హైదరాబాద్: రోజుకో కొత్త తరహా నేరాలతో క్రిమినల్స్ తెగబడుతున్నారు. అమాయకులు, సాధారణ పౌరులను మాత్రమే కాకుండా సినీ దర్శకులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. ఇదే తరహా సైబర్ క్రిమినల్స్ చేతిలో భీష్మ సినిమా దర్శకుడు వెంకట్ కుడుముల మోసపోయారు. ‘మీ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవానికి, పురస్కారాలకు ఎంపికైందంటూ… భీష్మ చిత్ర దర్శకుడు వెంకట్ కుడుములకు నవీన్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. భీష్మ చిత్రం ఆరు కేటగిరీలలో అవార్డులకోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని’ నమ్మించాడు. మాటలు నమ్మిన వెంకట్‌ను బురిడీ కొట్టించిన మోసగాళ్లు ఆయన వద్ద నుంచి రూ. 63వేలు కాజేశారు. అనుమానం వచ్చిన భీష్మ చిత్ర దర్శకుడు వెంకట్ వెంటనే సైబర్ కైరమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సైబర్‌క్రైమ్ ఏసీపీ తెలిపారు.
భీష్మ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములకు డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్పొరేషన్ నుండి ఫోన్ చేస్తున్నట్లు నవీన్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడాడు. ఒక్కో క్యాటగిరికి రూ. 10500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు. అది నమ్మిన అతను ఆరు క్యాటగిరీలకు గాను రూ. 63వేల నగదును అతను చెప్పిన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారుజ తిరిగి అదే వ్యక్తి కాల్ చేసి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల డబ్బులు అకౌంట్లో డిపాజిట్ కాలేదని… మరోసారి అంతే డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు. దాంతో వెంకట్‌కు అనుమానం రావడంతో…. ప్రొడ్యూసర్ తో మాట్లాడి చేస్తానని సమాధానం ఇచ్చారు. వెంటనే మాట మార్చిన ఫోన్‌కాల్‌లో ఉన్న వ్యక్తి అన్ని కేటగిరీలకు కాకున్నా… కనీసం ఒకటి, రెండు కేటగిరీలకైనా డబ్బు పంపించాలని కోరాడు. దీంతో వెంకట్‌కు అనుమానం బలపడి మోసపోయినట్లు గ్రహించారు. వెంటనే సైబర్ కైరమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ చిత్రోత్సవాలకు, పురస్కారాలకు సంబందించి మీ చిత్రాలు ఎంపికయ్యాయని… అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా అనామకులు ఫోన్లు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.