రూ.70వేలకు కన్నబిడ్డనే అమ్మేశాడు

0
326


హైదరాబాద్‌: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే నెల వయస్సున్న బిడ్డను అమ్ముకున్నాడు. చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాలమ్మ, రాజు దంపతులు స్థానికంగా యాచకవృత్తిని సాగిస్తూ కడుపు నింపుకుంటూ ఉంటారు. వారికి నెల రోజుల క్రితం ఓ మగబిడ్డ జన్మించింది. అయితే తల్లి ఒడిలో ఉన్న శిశువును వారం రోజుల క్రితం కన్నతండ్రే గుర్తు తెలియని వ్యక్తులతో బేరం కుదుర్చుకుని రూ.70వేలకు విక్రయించేశాడు. విషయం తెలుసుకుని షాక్‌కు గురైన కన్నతల్లి ఆ చిన్నారి కోసం ఎక్కడెక్కడో గాలించింది. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో పడ్డ చిన్నారి దక్కుతాడో లేడో అని ఆందోళనకు గురైంది. తన కుమారున్ని రక్షించి తనకు అప్పగించాలంటూ చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా ఆ చిన్నారిని రక్షించేందుకు ఎంతో శ్రమించారు. చాదర్‌ఘాట్‌ పరిసరాల్లో ఉన్న సుమారు 100 సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు. దాని ఆధారంగా ఎల్‌బీనగర్‌… ఎన్టీయార్‌ నగర్‌ ప్రాంతానికి ఆ చిన్నారి చేరినట్లు గుర్తించారు. స్థానికంగా నివసించే ఆఫ్రీన్‌ అనే మహిళ వద్ద శిశువు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాబును శిశు సంరక్షణ అధికారులకు అప్పగించనున్నట్లు చాదర్‌ఘాట్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని ఆయన తెలిపారు.

Leave a Reply