ఖాకీల్లో కరోనా టెర్రర్,

  0
  149

  ఇప్పటికే నలుగురు పోలీసుల మృత్యువాత

  500కి పైగా పాజిటివ్ బాధితులు

  హైదరాబాద్; పోలీసు శాఖలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కానిస్టేబుల్‌, హోంగార్డుతో మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా కరోనాతో మృతి చెందారనే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అధికారికంగా ఎవరూ ప్రకటించనప్పటికీ… నగరంలో నలుగురు పోలీసులు మృత్యువాత పడ్డారు. రోజురోజుకు పోలీసుల్లో పాజిటివ్ బాధితులు పెరుగుతుండటం సిబ్బందిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల వెస్ట్‌ జోన్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓతో పాటు అధిక సంఖ్యలో సిబ్బందికి కరోనా పాజిటివ్‌ రావడంతో మూడు కమిషనరేట్ల పరిధిలో పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య 500 దాటింది. మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో… సిబ్బంది క్వారంటైన్‌ లేదా హోం క్వారంటైన్‌కు పరిమితం కావాల్సి వస్తోంది. మిగిలిన సిబ్బందితో విధి నిర్వహణ కూడా ఓ సవాలుగా మారింది. 

  మే నెల 21న వెస్ట్‌ జోన్‌ పరిధి కుల్సుంపురా పీఎస్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ కరోనాతో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. నగర పోలీస్‌ శాఖలో ఇదే తొలి మరణం. జూన్‌ 15న ఓ హోంగార్డు కరోనాతో మృతి చెందారు. సిటీ ఆర్మ్ డ్‌ రిజర్వ్‌ హెడ్‌క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ (50) జూన్‌ నెలలో ఆస్పత్రిలో చేరి మూడు రోజుల పాటు చికిత్స పొంది కన్ను మూశారు. అక్కడే  విధులు నిర్వహిస్తున్న మరో హెడ్‌ కానిస్టేబుల్‌కు కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ జూన్‌ 7న గాంధీలో మృతి చెందారు.

  ప్రజలను కాపాడే ప్రయత్నంలో నిరంతర విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే పోలీసులు కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. టప్పాచబుత్ర పీఎస్‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏకంగా 15 మందికి కరోనా సోకింది. గత కొన్ని వారాలుగా నగరంలో జరుపుతున్న కరోనా పరీక్షల ద్వారా రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.  హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటివరకు సుమారు 500 మంది పోలీసులకు కరోనా సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకే అవకాశం ఉండటంతో.. వారిని కూడా క్వారంటైన్‌ చేసి అందరికీ పరీక్షలు చేస్తున్నారు. కరోనా సోకిన పోలీసుల కోసం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

  Leave a Reply