
ఢిల్లీ : లాక్ డౌన్లో అందరూ ఇంట్లోనే ఉండి సేఫ్ అనుకున్నాం. దేశమంతా ఇంట్లోనే బంధీ కావడంతో సురక్షితంగా ఉన్నామనుకున్నాం. కానీ ఇదే అదనుగా భావించి సైబర్ నేరస్తులు రెచ్చిపోయారు . వారు కూడా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దోచేశారు. సాధారణంగా జరిగే సైబర్ మోసాలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలను ఢిల్లీ పోలీసులు జులై-22న విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, లాక్డౌన్ అమలుకు ముందు మార్చి-22 వరకు నెలకు సరాసరిగా 1800-2000 కేసులు నమోదవగా, మార్చి-22 నుంచి ఏప్రిల్ -30 వరకు 3858 కేసులు నమోదయ్యాయి. అలాగే మే, జూన్ నెలలోనూ ఈ సంఖ్య నెలకు 4000 వరకు ఉంది. అంతకుముందు నెలలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, మనీ వ్యాలెట్, ఈ-మెయిల్ ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు కోరడం ద్వారా కోట్లాది రూపాయలు కష్టార్జితాన్ని కోల్పోయారు. లాక్డౌన్లో ఆన్లైన్ లావాదేవీలు పెరగడం, ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మోసగాళ్ల పని సులువైందని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. ఇంతవరకు ఇలాంటి గణాంకాలు ఢిల్లీ పోలీసులే ప్రకటించారు. తెలుగు రాష్టాలు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్టాలలోనూ ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశాలున్నాయి. ఈ వివరాలను పోలీసులు ప్రకటించాల్సి ఉంది.