ప్రముఖులకు కరోనా అంటూ సోషల్‌ పోస్టులు

0
190

సైబర్‌క్రైంలో అందుతున్న ఫిర్యాదులు


హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తున్న తరుణంలో సోషల్‌ గాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ఓ వైపు విభిన్న తరహాలో వైద్యులు, పోలీసులు, రాజకీయవేత్తలతో పాటు వివిధ విభాగాలకు చెందిన వారు సేవలందిస్తుండగా.. కొంతమంది అదే పనిగా పుకార్లను షికారు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. ముఖ్యంగా ఎంతోమంది ప్రముఖుల పేర్లు.. సేవలందిస్తున్న వారిని గుర్తించి వారికీ కరోనా వచ్చిందంటూ తప్పుడు వార్తలు సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్‌మీడియా అని భావించినప్పటికీ… కొంతమది సోషల్‌ వేదికగా… పత్రికలు నడిపిస్తున్న వారు సైతం వార్తలను వైరల్‌ చేస్తున్నారు. దీంతో నిరంతర సేవలందిస్తున్న పలువురు రాజకీయవేత్తలు, వైద్యులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలపై ఇప్పటికే సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు అందాయి.


డిప్యూటి మేయర్‌ పేరిట
కొన్ని రోజులుగా జీహెచ్‌ఎంసీ డిప్యూటి మేయర్‌కు కరోనా వచ్చిందంటూ వార్త వైరల్‌గా మారింది. నిజం నిర్ధారించుకోని రెండు సోషల్‌ పత్రికలు డిప్యూటి మేయర్‌ ఫోటోతో సహా దాన్ని ప్రచురించాయి కూడా. చాలా మంది నిజమని నమ్మేశారు కూడా. విషయం తెలుసుకున్న ఆయన ఆ విషయం తప్పు అని వెంటనే తన బంధుమిత్రులకు వివరించాల్సి వచ్చింది. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


కార్పొరేటర్లకూ…
డిప్యూటి మేయర్‌తో పాటు ఇద్దరు కార్పొరేటర్లకూ కరోనా వచ్చిందంటూ మరో వైరల్‌ వార్త. వారితో పాటు మరో 23 మంది కార్పొరేటర్లు క్వారంటైన్‌కు వెళ్లారని ప్రచారం జరిగింది. ఆ విషయంలో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యులకు అంటూ కూడా సోషల్‌మీడియాలో ప్రచారం సాగింది. దాంతో ఆస్పత్రి నిర్వాహకులు కూడా సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. కొంతమంది ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ.. మరి కొందరు అ లాంటి విషయాలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.


సోషల్‌ ఉనికి కోసం
సోషల్‌ మీడియాలో తమ ఉనికి చాటడం… గ్రూప్‌లో ఫాలోయింగ్‌ పెంచుకోవడంతో పాటు ప్రముఖులు, సెలబ్రిటీలకు ఇబ్బంది కల్గించడమే ధ్యేయంగా కొంతమంది సోషల్‌ గాళ్లు రెచ్చిపోతున్నారు. గతంలోనూ ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా హాట్‌ న్యూస్‌గా మారడంతో ప్రముఖుల విషయంలోనూ సోషల్‌మీడియాలో కరోనా పేరును వాడుకుని కొంతమంది రెచ్చిపోతున్నారు. గతంలో ఏదైతే హాట్‌ టాపిక్‌ ఉంటుందో సోషల్‌ మీడియాలో ఇ లాగే రెచ్చిపోతున్నారు. ఇలాంటి వేధింపులు.. సోషల్‌ వేదికగా తప్పుడు సమాచారం షేర్‌ చేస్తే వెంటనే సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.

Leave a Reply