ఆమె పోలీస్ అయితే… మహిళా అధికారులకు ప్రాధాన్యత – డీజీపీ మహేందర్ రెడ్డి

0
359


హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీస్ అధికారులకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. వారికి ప్రత్యేక వసతులను కల్పించడంతోపాటు సమర్ధవంతమైన అధికారులకు లా అండ్ ఆర్డర్ లో ప్రాధాన్యత నివ్వాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. “మా ప్రతి పదం – ప్రగతి రదం” అనే అంశం పై డీ.జీ.పీ. ఎం.మహేందర్ రెడ్డి నేడు రాష్ట్రంలోని మహిళా పోలీస్ అధికారులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. డీజీపీ కార్యాలయం నుండి అడిషనల్ డీ.జీ.లు జితేందర్, శివధర్ రెడ్డి, స్వాతి లక్రా, ఐ.జీ. నాగిరెడ్డి, బాల నాగాదేవీ, డీ.ఐ.జీ. సుమతి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీ.జీ.పీ “మా ప్రతి పదం – ప్రగతి రథం” అనే వీడియోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డీ.జీ.పీ. మాట్లాడుతూ, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణా రాష్ట్రం లో మహిళా పోలీస్ అధికారులకు సముచిత గౌరవం తోపాటు అన్ని వర్క్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని తెలిపారు. కాగా కొన్ని స్టేషన్లలో మరికొన్ని సదుపాయాలను కల్పించాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంలో అని పోలీస్ నియామకాల్లో మహిళలకు 33.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు మహిళా పోలీస్ అధికారుల సంఖ్య 2325 ఉండేదని, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఈ మహిళా పోలీస్ అధికారుల సంఖ్య 4819 కు చేరిందని అన్నారు. సమర్థత ప్రాతిపదికగా మహిళా పోలీసు అధికారులకు సముచిత స్థానాన్ని కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసు అధికారులకు ప్రత్యేక వాష్ రూమ్ లు ఉండాలని, వీటితోపాటు చెంజింగ్ రూమ్ లు, ఫీడింగ్ రూమ్ లు ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత పెరిగిందని, ఈ దిశలో మహిళా పోలీసు అధికారులతోనే పోలీస్ శాఖ ఖ్యాతి పెరుగుతుందని ఆయన తెలిపారు. అడిషనల్ డీ.జీ. స్వాతీ లక్రా మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రం లో మహిళా పోలీసులకు అన్ని విధాలా ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా తెలంగాణాలో పోలీసు నియామకాల్లో 33 శాతం మహిళలకు కేటాయించారని తెలియచేశారు. తెలంగాణా రాస్ట్రానికి ముందు పోలీస్ శాఖలో కేవలం 3 శాతం కన్నా తక్కువగా ఉండగా, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ఇది 7.54 శాతానికి పెరిగిందని వివరించారు.రాష్ట్రం లో మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు. మహిళా ఉన్నతాధికారులతో ప్రత్యేక సామావేశం నిర్వహించి మహిళా భద్రతకు మరింతగా చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో మహిళా పోలీసుల స్థితిని డీ.ఐ.జీ. సుమతి విశ్లేషించారు. రాష్ట్రం లో 4066 మంది మహిళా కానిస్టేబుళ్లు, 222 హెడ్ కానిస్టేబుళ్లు, 284 మంది ఎస్.ఐ లు, 35 మంది సీ.ఐ లు. ఇద్దరు ఏ.ఎస్.పీ లు, 16 మంది అదనపు ఎస్.పీ.లు మహిళలున్నారని వెల్లడించారు. ఈ సందర్బంగా పలువురు పోలీస్ అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహిళా భద్రతా విభాగం రూపొందించిన “ఆమె పోలీస్ అయితే” అనే పుస్తకాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు.

Leave a Reply