డ్రాగన్‌ గేమింగ్‌ నిందితుల కస్టడీ

0
178


హైదరాబాద్‌: చైనీయులు ఆడిన ఆట… డ్రాగన్‌ గేమింగ్‌లో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులు సోమవారం (ఆగస్టు24న) కస్టడీలోకి తీసుకున్నారు. రెండో రోజు కూడా సీసీఎస్‌లో వారి విచారణ కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో సేకరించిన వందల కోట్ల రూపాయలను ఎలా మళ్లించారు… నిర్వాహకులు ఎంతమంది.. మన దేశంలో సహకరిస్తున్న వారితో పాటు బాధితులు ఎంతమంది ఉన్నారనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభమైంది. తొలుత రూ. 1100కోట్ల స్కామ్‌తో ప్రారంభమైన గేమింగ్‌ వ్యవహారం విచారణలో పోలీసులు తవ్విన కొద్దీ వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే రెండు అకౌంట్ల నుంచి చైనాకు రూ. 1100కోట్లకు పైగా మళ్లింపులు జరిగాయని గుర్తించిన అధికారులు… ఇతర అనుమానిత ఖాతాలపై దృష్టి సారించారు. దాంతో ఈ లావాదేవీల వ్యవహారం 2వేల కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. సోమవారం కస్టడీకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల పాటు చైనీయునితో సహా నలుగురు నిందితులను విచారించనున్నారు. మోసాలు చేసిన తీరు… ఎంతమంది బాధితులు ఉండే అవకాశముందనే అంచనా… నిందితుల సంఖ్య… పరారీలో ఉన్న వారి ఆచూకీ వివరాలతో పాటు పలు కీలక అంశాల గురించి నిందితులను కస్టడీలో విచారించనున్నారు. ఈ నెల 13న నిందితులను అరెస్టు చేయగా… సమగ్ర విచారణ నిమిత్తం వారిని కస్టడీకి ఇవ్వాలంటూ సైబర్‌క్రైం పోలీసులు కస్టడీ పిటిషన్‌ వేశారు. విచారించిన కోర్టు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో మరి కొన్ని కోణాలు వెలుగు చూసే అవకాశముంది.
బీజింగ్‌ టీ పవర్‌ కంపెనీ పేరిట దేశంలో ఏడాది క్రితం లావాదేవీలు ప్రారంభించిన డ్రాగన్‌ కంపెనీ గతేడాది కేవలం రూ. 5కోట్ల వ్యాపారమే చేసింది. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ఏజెంట్లను సమకూర్చి వారి ద్వారా అమాయకులను ఊబిలోకి లాగిన ఆయా కంపెనీల ప్రతినిధులు ఈ ఏడాది ఏడు నెలల్లో భారీగా లావాదేవీలు కొనసాగించారు. ముఖ్యంగా మార్చి నెలలో లాక్‌డౌన్‌ విధించిన తర్వాత ఈజీగా ట్రాప్‌ చేస్తే కేవలం ఈ ఏడాదిలోనే రూ. 2వేల కోట్లకు పైగా దందా చేసినట్లు గుర్తించారు. ఎలాంటి రిస్కు లేకుండా వచ్చిన డబ్బును వచ్చినట్లే చైనా కంపెనీకి మళ్లించి ఇక్కడ చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లు మార్చడం.. కంపెనీ అకౌంట్లు మార్చడంతో ఎన్ని అకౌంట్లలో ఎన్ని గేమింగ్‌ వెబ్‌సైట్ల నుంచి డబ్బులు పోయాయో విచారణలో వెల్లడయ్యే అవకాశముంది. సోమవారం నుంచి గురువారం వరకు జరిగే కస్టడీలో పలు అంశాలను రాబట్టేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.
నిందితుల అరెస్టు అనంతరం స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను పరిశీలించిన అధికారులు దాని ఆధారంగా కూడా వివరాలు సేకరిస్తున్నారు. చైనా భాషలో ఉన్న డేటాను క్రాక్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు సైబర్‌క్రైం పోలీసుల పరిశోధనలో సాఫ్ట్‌వేర్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో గేమింగ్‌ ద్వారా వచ్చే డబ్బులు వచ్చినట్టే… చైనాకు మళ్లిపోయే విధంగా రూపొందించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో విచారణతో పాటు… అమాయక ప్రజలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని సీసీఎస్‌ ఉన్నతాధికారి తెలిపారు. అయితే వీటన్నింటిని ఈ నాలుగురోజుల కస్టడీ ద్వారా వివరాలు సేకరించే ప్రయత్నాలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేవలం నిర్వాహకులు మాత్రమే కాకుండా గేమింగ్‌లో పాల్గొన్న వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
విచారణలో ముఖ్యంగా ఎంతమంది చైనీయులు ఈ వ్యవహరంలో ఉన్నారనే అంశాలతో పాటు ఇక్కడ ఎవరెవరు సహకరిస్తున్నారనే విషయాలను రాబట్టనున్నారు. ఇప్పటికే పరారీలో ఉన్న నిందితుని ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటి వరకు ఎన్ని వెబ్‌సైట్లు, ఎన్ని కంపెనీల ద్వారా ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యవహారం నడిచింది… బాధితులెంత మంది ఉన్నారనే డేటాను సేకరించనున్నారు. వారి ల్యాప్‌టాప్‌, ఫోన్లను క్రోఢీకరించి వాస్తవాలు గుర్తించే ప్రయత్నం చేస్తారు. బ్యాంకు ఖాతాల గురించి ఆరా తీసి.. సంబంధమున్న ఖాతాలను ఫ్రీజ్‌ చేసే అవకాశముంది. విచారణలో నిందితులు పూర్తిగా సహకరిస్తే.. సైబర్‌ క్రైం పోలీసుల అత్యధిక విషయాలు రాబట్టే అవకాశముంది. ఇప్పటి వరకు అరెస్టయిన నలుగురితో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశముంది.

Leave a Reply