న్యూ ఇయర్‌ లక్ష్యంగా డ్రగ్స్‌?

0
219


హైదరాబాద్‌: కరోనా ఇయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న 2020ని వీడ్కోలు పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. లాక్‌డౌన్‌తోనే ఎక్కువ భాగం గడిచిన ఈ ఏడాదిలో… ఏదో ఓ రకంగా అందరూ నష్టపోయారు. విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం… ఇతరత్రా అందరిపై ఇది ప్రభావం చూపింది. అదే విధంగా మాదకద్రవ్యాల దందా చేసే వారు కూడా ఈ ఏడాది తమ దందా అంతగా సాగలేదేమోనని భావించి ఉంటారు. లాక్‌డౌన్‌ తర్వాత ఒకేసారి వివిధ నగరాల్లో విరుచుకు పడుతున్నారు. హైదరాబాద్‌ కూడా డ్రగ్స్‌ వ్యాపారుల అడ్డాగా మారడంతో ఇక్కడా కేసులు వెలుగు చూస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో అంతగా జరగని దందాను పూర్తిగా రికవరీ చేయడానికి డ్రగ్స్‌ మాఫియా పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. గత సెప్టెంబర్‌ నెల నుంచి మళ్లీ ఉనికి చాటుతున్న ఆఫ్రికన్‌, నైజీరియన్‌లకు తోడుగా నగరంలోనే పుట్టుకొస్తున్న డ్రగ్స్‌ సరఫరా దారుల దందాలు వెలుగులోకి వస్తున్నాయి. అకస్మాత్తుగా డ్రగ్స్‌ కేసులు తెరపైకి రావడంతో పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు అప్రమత్తమవుతున్నారు. 2020 ఏడాది ముగియడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున సాధారణంగానే న్యూ ఇయర్‌ హడావిడి ప్రారంభమవుతుంది. దాన్నే అవకాశంగా మలుచుకోడానికి ఇప్పటికే డ్రగ్స్‌ దందాదారులు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. పోలీసులు, అధికారులు, ఎక్సైజ్‌ సిబ్బంది దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కొకైన్‌ లాంటి ఖరీదైన డ్రగ్స్‌ సరఫరా చేసే సరఫరా దారులు తెలివిగా రూట్‌ మార్చారు. వారు నేరుగా ఫీల్డ్‌లోకి రాకుండా… వారి కస్టమర్ల ద్వారానే దందా సాగిస్తూ… కొకైన్‌ మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయాలతో కూడా దందా సాగిస్తున్నారు. కరడు గట్టిన నేరస్తులు మాత్రమే కాదు… విద్యావంతులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు.. ఇలా తెలివైన వారు సైతం ఈ చీకటి దందాలో అడుగు పెడుతున్నారు.


వెలుగు చూస్తున్న వాస్తవాలు
రెండు రోజుల క్రితం దాడులు నిర్వహించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది 55 ఎల్‌ఎస్‌డీ బ్లాట్లతోపాటు 3 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మెహిదీపట్నం, బోయినపల్లి ప్రాంతాల్లో నిఘా పెట్టి డ్రగ్స్‌ విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్‌లో బిట్‌కాయిన్‌లు చెల్లించి మరీ డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా అధిక సంపాదన ఉంటుందని భావిస్తున్న యువకులు వాటిని వివిధ సోషల్‌ మాధ్యమాల ద్వారా కోడ్‌ భాషలో వివరిస్తూ విక్రయిస్తున్న కేసులు కూడా పోలీసులకు చిక్కాయి. ఫ ఈ నెల2న ముగ్గురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కూడా ఈ అక్రమ దందాకు పాల్పడి పోలీసులకు చిక్కడం మరింత ఆందోళన కలిగించే అంశమే. తొలుత డ్రగ్స్‌కు బానిసలుగా మారి… వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో అదే దందా చేయడం ఉత్తమం అని భావిస్తున్నారు. ఇలాంటి వారికోసమే చూస్తున్న నైజీరియన్లు ఇక్కడి వారిని పావులుగా మార్చుకుని తమ చీకటి వ్యాపారం సాగిస్తున్నారు. వారి వద్ద నుంచి 150మైక్రో గ్రాములున్న 56బ్లోట్లు ఎల్‌ఎస్‌డీ, రెండు ప్లాస్టిక్‌ బాటిళ్లలో నిల్వ ఉన్న 236గ్రాముల హషీష్‌ ఆయిల్‌, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఫ నవంబర్‌ 24న ఆఫ్రికాలోని ఘనా దేశపు వాస్తవ్యుడు సామ్యూల్‌ స్మిత్‌ నెల్సన్‌ (32)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులోనే ఓ సారి కొకైన్‌ కలిగి ఉన్నాడనే ఆరోపణలపై అరెస్టయి జైలుకెళ్లి నవంబర్‌ 12న విడుదలయ్యాడు. వెంటనే మళ్లీ డ్రగ్స్‌ సరఫరా ప్రారంభించి ముంబై నుంచి కొకైన్‌ తెప్పించాడు. విక్రయిస్తుండగా ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 61గ్రా. కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఫ నవంబర్‌ 20న స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ మాదకద్రవ్యాల సరఫరాదారుడి అవతారమెత్తిన యువకున్ని ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాలాజీసింగ్‌ అనే యువకుడు కెనడాలో ఎంఎస్‌ చదువుకుంటున్న సమయంలో కెనబీస్‌ (మాదకద్రవ్యాలు) సేవించే అలవాటు చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో ఆ తర్వాత స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేశాడు. స్విగ్గీలో పని చేస్తూనే హషీష్‌ ఆయిల్‌, గంజాయిలను కూడా సరఫరా చేయసాగాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్‌్స్‌మెంట్‌ అధికారులు బాలాజీని అదుపులోకి తీసుకుని విచారించారు. అంతకు ముందు రోజు ముంబై నుంచి నగరానికి తీసుకొచ్చి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.
ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్‌ దందాలో ఇంకా ఎన్నో కేసులు అధికారుల దృష్టికి రాకుండా వెళ్తున్నాయనడంలో సందేహాలు ఉండకపోవచ్చు. అధికారులు, పోలీసుల కళ్లు గప్పి తేవడానికి ప్రత్యామ్నాయ దారులను డ్రగ్స్‌ దందాదారులు వెదుక్కొంటున్నారునడంలో కూడా డౌట్‌ లేదు. ఈ ఏడాది చివరి వరకు నగరంలో డ్రగ్స్‌ ప్రవేశించకుండా పోలీసులు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో… ఎంత మేరకు డ్రగ్స్‌ను అడ్డుకుంటారో వేచి చూడాల్సిందే. డ్రగ్స్‌ దందాదారులు కూడా న్యూ ఇయర్‌కోసం పోలీసుల దృష్టి మళ్లించడానికి కొత్త అవకాశాలు వెదుక్కుంటున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. న్యూఇయర్‌కు కొన్ని వారాల ముందే భారీగా మాదకద్రవ్యాలు నగరానికి చేరుకుంటున్నాయనే అనుమానాలు గత అనుభవాల ద్వారా వెల్లడవుతున్నాయి.

Leave a Reply