వైజాగ్‌ టు గోవా వయా హైదరాబాద్‌
డ్రగ్స్‌ సరఫరా ముఠా అరెస్టు

0
406

హైదరాబాద్‌: వైజాగ్‌ టు గోవా వయా హైదరాబాద్‌ డ్రగ్స్‌ ఎక్స్‌చేంజ్‌ చేసి హైదరాబాద్‌లో సరఫరా, విక్రయాలు చేస్తున్న ఓ లేడీతో సహా ముగ్గురిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళను గోవా తరలించడానికి బస్టాండుకు వెళ్తున్న సమయంలో సమాచారంతో ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14 ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 30గ్రా. ఎండీఎంఏ, 10కేజీల ఎండు గంజాయి, 4 ఎల్‌ఎస్‌డీ బ్లోట్స్‌, 50గ్రా. చరస్‌, రెండు బైక్‌లు, 4 సెల్‌ఫోన్లు, ఓ ఎలకా్ట్రనిక్‌ తూకపు యంత్రం స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్‌ నివాసి ఎం. శివశంకర్‌రెడ్డి (26), బల్కంపేట్‌ వాసి గంధంమణికంఠ (26), వెస్ట్‌బెంగాల్‌, డార్జీలింగ్‌కు చెందిన శిల్పారాయ్‌ (27)లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడైన మాదకద్రవ్యాల ప్రధాన సరఫరా దారుడు, గోవా నుంచి తరలించి కమీషన్‌ పద్ధతిలో ఇక్కడ సరఫరా చేసే విశాఖ నివాసి మనుకొండ సత్యనారాయణ కోసం గాలిస్తున్నారు. తప్పించుకు తిరుగుతున్న సత్యనారాయణ ఆదేశాల మేరకు వైజాగ్‌లో గంజాయి, చరస్‌ తీసుకుని మహిళ యైున శిల్పారాయ్‌ తన లగేజ్‌ బ్యాగులో పెట్టుకుని ప్రైవేట్‌ బస్సులలో నగరానికి చేరుకుంటుంది. ఇక్కడికి చేరిన తర్వాత ఓయో రూమ్‌ లేదా కొండాపూర్‌లో ఉన్న సత్యనారాయణకు సంబంధించిన గదిలో రెస్ట్‌ తీసుకుని అదే రోజు సాయంత్రం ఆ సరుకు తీసుకుని ఆమె ప్రైవేట్‌ బస్సు ద్వారా గోవా వెళ్తుంది. బస్సు మార్గంలో వైజాగ్‌ నుంచి నేరుగా గోవా వెళ్లే అవకాశం లేనందున తప్పనిసరిగా హైదరాబాద్‌కు వచ్చి వెళ్లాల్సిందే. గోవా చేరుకున్న తర్వాత ఆమె గంజాయి, చరస్‌ను సత్యనారాయణకు అప్పగించి దానికి బదులుగా ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ బ్లోట్స్‌ తీసుకుని నగరానికి చేరుకుంటుంది. ఆ తర్వాత శివశంకర్‌రెడ్డి, మణికంఠలకు అప్పగిస్తుంది. దీనికోసం ఆమెకు ప్రతి ట్రిప్పుకు రూ. 10వేలు లభిస్తాయి. ఆ సరుకును మణికంఠ, శివశంకర్‌రెడ్డిలు కలిసి తెలిసిన కస్టమర్లకు రూ. 5వేలకు గ్రాము చొప్పున ఎండీఎంఏ, రూ. 2వేలకు గ్రాము చొప్పున ఎల్‌ఎస్‌డీ బ్లోట్స్‌ విక్రయించి వచ్చిన డబ్బులో తమ కమీషన్‌ తీసుకుని మిగతా డబ్బును సత్యనారాయణకు పంపిస్తుంటారు.

Leave a Reply