ఏసీబీ వలలో అవినీతి అధికారి
రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌

0
181అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ విద్యాశాఖలో పని చేస్తున్న అధికారి రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. అధికారిక సాయం చేస్తానని ఓ వ్యక్తి నుంచి రూ. 40వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం సాయంత్రం అధికారులు పట్టుకున్నారు. సైఫాబాద్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో బొడ్ల శ్రీనివాస్‌… అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ప్రైవేటు స్కూళ్ల అనుమతి సెక్షన్‌లో)గా పని చేస్తున్నాడు. ఓ ప్రైవేటు స్కూల్‌ మేనేజర్‌ నీలం శివశంకర్‌ అనే వ్యక్తికి సంబంధించిన ఫైల్‌ను అప్‌గ్రేడ్‌ చేయడానికి రూ. 40వేలు డిమాండ్‌ చేశాడు. 8వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్న పాఠశాలను పదో తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేసేందుకు కార్యాచరణనను ముందుకు తీసుకెళ్తానని తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ లంచం డిమాండ్‌ చేశారు. దీంతో శివశంకర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుఽధవారం సాయంత్రం 5.10 గంటల సమయంలో కార్యాలయంలోనే లంచం డబ్బులు అందజేయాలని బొడ్ల శ్రీనివాస్‌ ఆదేశించడంతో బాధితుడు అక్కడికి చేరుకున్నాడు. కార్యాలయంలో అతను చెప్పిన విధంగా లంచం డబ్బులను అతని టేబుల్‌ డ్రాయర్‌లో పెట్టగా… ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని కెమికల్‌ టెస్టులు నిర్వహించారు. డబ్బులతో పాటు రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారిని అరెస్టు చేశారు. అతని కార్యాలయంలో విచారించిన అధికారులు అతన్ని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. అతనిపై ఉన్న ఇతర ఆరోపణల గురించి ఆరా తీయడంతో పాటు ఆస్తుల గురించి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Leave a Reply