హైదరాబాద్: అన్ని నేరాలను వెనకకు నెట్టి… అతి వేగంగా దూసుకెళ్తున్న సైబర్ నేరాల గురించి తెలియంది కాదు. ఈ ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నేరాలు తగ్గాయని స్వయంగా అధికారులే స్పష్టం చేశారు. కానీ నేరాలు తగ్గినప్పటికీ సైబర్ నేరాలు మాత్రం పెరుగుతూనే ఉంటాయని అధికారులే ఒప్పుకుంటున్నారు. ఓ నేరం గురించి బాధితుల్లో అవగాహన పూర్తిగా రాకముందే కొత్త రకం నేరంతో సైబర్ నేరస్తులు ముందుకు వస్తున్నారు. ఊహించని విధంగా అమాయకులను బురిడీ కొట్టించడంలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పటి వరకు బాధితుల ప్రమేయంతోనే సైబర్ నేరాలు జరిగేవి. కానీ తాజాగా జరిగిన కొత్తతరహా సైబర్ నేరంలో అసలు బాధితుని ప్రమేయం లేకున్నా దర్జాగా డబ్బును కాజేశారు. ఫోన్ కాల్ చేయకుండా… .ఓటీపీ అడగకుండా సీవీవీ ప్రస్తావన లేకుండా, డెబిట్/క్రెడిట్ కార్డు నెంబరేంటని ప్రశ్నించకుండా… అసలు ఆ వ్యక్తి ప్రమేయం లేకుండానే ఆయన ఖాతాలో నుంచి రూ. 10వేలు మాయమయ్యాయి. అసలేం జరిగిందో తెలుసుకున్న ఆ వ్యక్తితో పాటు కేసు నమోదు చేసిన పోలీసులు సైతం కొత్త తరహా మోసం చూసి ముక్కున వేలేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో ప్రమేయమున్న ఇద్దరు సీఏ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ… కొత్తగా తెరమీదకు వచ్చిన మోసంతో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. తన ఖాతాలో డబ్బులు మాయమయ్యాయని మధురానగర్ నివాసి సిద్దిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి సంజీవరెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆనపర్తిలోని ఐసీఐసీఐ బ్యాంకులో అతనికి ఖాతా ఉంది. డిసెంబర్ 22న తన ఖాతా నుంచి రూ. 10 వేలు విత్‌డ్రా అయినట్లు సమాచారం వచ్చింది. తన డబ్బును ఎవరో తస్కరించారని గ్రహించిన బాధితుడు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నగదు విత్‌డ్రా అయిన పే పాయింట్ కేంద్రం ఐపీ అడ్రస్ ఆధారంగా… అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు సీఏ విద్యార్థులు విశాల్, అర్షద్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఆస్తులకు సంబంధించిన వెబ్సైట్ ఆధారంగా వివరాలు సేకరించి సత్యనారాయణ మూర్తి ఖాతాను యాక్టివేట్ చేసిన విద్యార్థులు రూ. 10వేలు డ్రా చేసినట్లు ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగానికి సంబంధించిన వెబ్సైట్ నుంచి భూములకు సంబంధించిన పత్రాలు డౌన్లోడ్ చేశారు. ఆయా పత్రాల్లో ఉన్న సదరు వ్యక్తికి సంబంధించిన ఆధార్‌కార్డు నెంబర్, అతని వేలి ముద్రలను సేకరించారు. దస్తావేజుల్లో ఉన్న ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటోలను నీటి చుక్కల సాయంతో పేపాయింట్ ద్వారా డబ్బు తస్కరించినట్టు నిందితులు వెల్లడించారు. పే పాయింట్ యాప్ ద్వారా డబ్బు లావాదేవీలు నిర్వహించుకునే అవకాశముంది. పే అకౌంట్లకు సంబంధించి ఇతర యాప్‌ల మాదిరిగానే… ఈ యాప్‌కు కూడా ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఉంది. నిందితులు సిద్దిరెడ్డి వేలిముద్రలను సేకరించి వాటిని కాపీ చేసి… అలాంటి నకిలీ వేలిముద్రల ఆధారంగా పేపాయింట్‌లో లాగిన్ అయ్యారు. ఇందులో వీరిద్దరికీ… మూడో వ్యక్తి కూడా సహకరించి ఉంటాడనే అనుమానాలు కూడా ఉన్నాయి. అతని ద్వారానే ఆయన ఖాతా ఏ బ్యాంకులో ఉందో తెలుసుకుని ఉంటారని అనుమానం. వేలి ముద్రలతో లాగిన్ అయ్యి డబ్బును ట్రాన్స్ఫర్ చేసి… పిన్ నెంబర్ లేకుండానే వేలి ముద్రలతో పని కానిచ్చేశారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఫోన్లో బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఫోన్లో, ఆన్లైన్లో అతి జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.