
భద్రాచలం: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మరోసారి గంజాయి కలకలం రేపింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రెండు వాహనాల్లో తరలిస్తున్న 636 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆగస్ట్ 25న ఉదయం 07:00 గంటలకు భద్రాచలం అంబేద్కర్ సెంటర్ వద్ద సిఐ వినోద్, ఎస్సై మహేష్ లు తమ సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ ఐచర్ వ్యాన్ తో పాటు టాటా టియాగో కారులను ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ నిషేదిత గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ నలుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.ఈ తనిఖీల్లో కారు నందు 27 కేజీల గంజాయి, ఐచర్ కంటైనర్ నందు 609 కేజీల గంజాయి మొత్తం 636 కేజీల గంజాయి లభ్యమైంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 96 లక్షలు ఉంటుందని ఏఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు. అరెస్ట్ అయినవారిలో హర్యానాకు చెందిన నరేష్ కుమార్, ముకేశ్ కుమార్, రాజస్థాన్ వాస్తవ్యులు భల్వీర్, జితేందర్ శర్మలు ఉన్నారు. భద్రాచలం పట్టణ సరిహద్దులలో నిత్యం పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి ఇతర నిషేధిత వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.