
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో మరో కలకలం రేగింది.కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు ఆస్పత్రి నుంచి పరారయ్యారు. వైరస్ సోకడంతో కొన్ని రోజుల క్రితం చర్లపల్లి, చంచల్ గూడ జైళ్ళకు చెందిన అధికారులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. తప్పించుకున్న వారిలో ఇద్దరు చంచల్ గూడ రిమాండ్ ఖైదీలు కాగా ఒకరు చర్లపల్లి జైలు లో శిక్ష ఖరారైన ఖైదీ. మరొకరు శిక్ష ఖరారై చర్లపల్లి జైలు నుంచి మానసిక చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖైదీ గా ఉన్నారని సమాచారం. గాంధీ ఆస్పత్రి లోని మెయిన్ బిల్డింగ్ రెండో అంతస్తులో చికిత్స పొందుతూ ఆ నలుగురు ఆగస్టు 27 తెల్లవారుజామున పారిపోయారు. రెండో అంతస్తులో ని బాత్రూం లో ఉన్న గ్రిల్స్ తొలగించి వారు పరారైనట్లు అత్యధిక విచారణలో తేలింది. అయితే వారు బయటకు తప్పించుకున్నారా లేక ఆస్పత్రిలోనే ఎక్కడైనా దాక్కున్నారా అని ఆస్పత్రి లో చెకింగ్ కొనసాగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు తప్పించుకున్న ఖైదీల కోసం గాలిస్తున్నారు.