ఇన్స్టంట్ లోన్‌యాప్ కేసులో చిక్కిన నిందితుల్లో చైనీయులపాటు కొంతమంది భారతీయులు ఉన్నారు. అయితే ఒకరిద్దరు చైనీయులు పోలీసులకు చిక్కగా… 25కి పైగా భారతీయులు ఇప్పటి వరకు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు చిక్కారు. ఇప్పటి వరకు రుణాల యాప్‌లకు సంబంధించి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అందులో పుట్టుకొస్తున్న కొత్త తరహా కేసులు కూడా మరో సవాలుగా మారాయి. ఓ వైపు యాప్‌లు సృస్టించి ఎంతో అమాయకులను పొట్టన పెట్టుకున్న కేసుల విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. విచారణలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 1200 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశారు. వందల కోట్ల రూపాయలు ఆయా ఖాతాల్లో ఉండటంతో లావాదేవీలు జరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అయినా బ్యాంకుల్లో ఉన్న లొసుగులు… బ్యాంకు అధికారుల కక్కుర్తి అక్కడా మోసాలకు ఆస్కారం కల్పిస్తున్నారు. చైనీయులు వచ్చి దోచుకెళ్లగా… మిగిలిన వాటిని మనోళ్లే దోచుకునే ప్రయత్నం చేస్తున్నారనడానికి బ్యాంకు అధికారుల కమీషన్ల కక్కుర్తి నిలువటద్దంలా మారింది.
వెలుగు చూసిన కొత్త మోసం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రుణాల యాప్‌ల కేసుల్లో నిందితులుగా ఉన్న వారు జైల్లో ఉండి కూడా బయట చక్రం తిప్పుతున్నట్లు అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్రమేణా వారికి బ్యాంకు అధికారులు కూడా కొంతమంది చేతులు కలిపినట్లు స్పష్టమైంది. తాజాగా సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్ అలీపోర్ శాఖ మేనేజర్ ఉదంతమే దానికి నిదర్శనం. రూ. 30వేల కోట్లకు పైగా కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైం పీఎస్‌లో 25మంది అరెస్టు అయిన విషయం తెలిసిందే. వారిలో ఓ చైనీయునితో పాటు బ్యాంకు ఖాతాల డీఫ్రీజ్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న ఇద్దరు, బ్యాంక్ మేనజర్ మినహా మిగతా 21 మందికి బెయిల్ దొరికింది. ఈ వ్యవహారంలో వందల మంది నిందితులు ఉన్నారని.. మరో వెయ్యికి పైగా బ్యాంకు ఖాతాల నుంచి లావాదేవీలు జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానం. ప్రధాన సూత్రధారితో పాటు అతనికి సహకరించిన వారు ఇక్కడి నుంచి పారిపోయి విదేశాల్లో తల దాచుకున్నారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోనే ఉంది.
ఫ్రీజ్ ఖాతాలపై నజర్.. అధికారులు కుమ్మక్కు
రుణాల యాప్‌ల కేసుకు సంబంధించిన కేసు దర్యాప్తు సాగుతుండగానే…. బ్యాంకుల్లో ఫ్రీజ్ అయిన డబ్బును కూడా తస్కరించేందుకు రుణాల యాప్ నిందితులు పథకాలు పన్నుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 50కి పైగా బ్యాంకు బ్రాంచీలకు సైబర్‌క్రైమ్ పోలీసుల పేరిట ఫోర్జరీ లేఖలు రాసి డబ్బును విత్‌డ్రా చేసే ప్రయత్నాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒకటి రెండు చోట్ల నిందితులు సక్సెస్ అయ్యారు. కోల్‌కతాలోని ఐసీఐసీఐ బ్యాంకు అలీపోర్ శాఖ నుంచి రూ. 1.18 కోట్లు కాజేసిన యాప్ నిందితులు పోలీసులకే కొత్త సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని గతంలో అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు ఆ శాఖాధికారి రాకేశ్‌కుమార్ దాస్ పాత్ర కూడా స్పష్టం కావడంతో ఆగస్టు 30న అతన్ని కూడా అరెస్టు చేసి నగరానికి తరలించారు. ఇలాంటి మరో వ్యవహారంలో డబ్బు మళ్లించేందుకు లంచం తీసుకున్న ఓ ఈడీ అధికారిపై బెంగళూరులో సీబీఐ కేసు నమోదు చేయడం గమనార్హం. ఇలాంటి వ్యవహారంలో ఇద్దరు ముగ్గురు మాత్రమే కాదు.. కమీషన్లకు కక్కుర్తి పడిన అధికారుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. డబ్బులు విత్‌డ్రా లేదా ట్రాన్స్ఫర్ చేయడం అంత సులువు కాదని… కొంతమంది అధికారులు, బ్యాంకు సిబ్బంది ప్రమేయంతోనే ఇది సాధ్యమవుతోందని ఓ అధికారి వివరించారు. కోల్‌కతా అలీపోర్ శాఖ కుంభకోణం వెలుగు చూడటంతో ఫ్రీజ్ చేసిన ఇతర ఖాతాలపై కూడా నిఘా పెట్టినట్లు అధికారి తెలిపారు.