భార్యాభర్తలకు ఎంత కష్టం
ఊళ్లో అప్పులు.. నగరంలో తిప్పలు
వారి గోడును బయటకు తెచ్చిన ఇమ్రాన్‌
వైరల్‌గా మారడంతో వారికి దాతల సాయం

0
207

హైదరాబాద్: ఉన్న ఊళ్లో అప్పులు పెరిగాయి.. నగరానికి వలస వచ్చి స్కూల్‌ బస్సు నడుపుకుంటున్నాడు. ఏడాదికి పైగా స్కూళ్లు మూతబడటంతో అక్కడా ఉపాధి కరువైంది. తనకు వచ్చిన డ్రైవింగ్‌ నైపుణ్యంతో అద్దెకు తీసుకున్న ఓలా కారు నడుపుకుంటున్నాడు. అయినా అతనికి విధి కనికరించలేదు. ఉపాధితో వచ్చిన డబ్బులు ఇల్లు గడవడానికే సరిపడకపోయేది. గత రెండు నెలలుగా మళ్లీ కరోనా విజృంభణతో ఆదాయం తగ్గిపోయింది. ఇంటి అద్దె చెల్లించడం లేదంటూ ఇంటి ఓనర్‌ భార్యా భర్తలిద్దరినీ ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. ఊరికి వెళ్లలేక..ఇక్కడ షెల్టర్‌ లేక భార్యతో కలిసి ఫుట్‌పాత్‌నే ఆవాసంగా మార్చుకున్నాడు. కానీ అక్కడా అతనికి తిండితో పాటు మనశ్శాంతి కరువైంది. పగలు ఎలాగోలా సర్దుకున్నా… రాత్రి వేళల్లో గంజాయి సేవించి వచ్చే రోడ్‌సైడ్‌ పోకిరీలు భార్యను వేధించడం.. ఆమెను లాక్కెళ్లడానికి ప్రయత్నించడంతో ఏం చేయాలో తోచక రాత్రంతా జాగారం చేయాల్సిన దుస్థితికి చేరుకున్నాడు. ఓ రోజు అతనికి ఆహారం పొట్లం ఇవ్వడానికి వెళ్లిన యువకుడు ఆహారం ఇచ్చి వెళ్లిపోతే పరిస్థితి ఎలా ఉండేదో కానీ.. అతను ఆగి ఆ వ్యక్తి గురించి ఆరా తీయడంతో కష్ట సమయంలో అతనికి కాస్త ఊరట లభించింది. నగరం నడిబొడ్డున… సికింద్రాబాద్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో చోటు చేసుకున్న ఈ
వరంగల్‌ జిల్లాకు చెందిన డ్రైవర్‌ కృష్ణారావు భార్యతో కలిసి ఏడాది కాలంగా బేగంపేటలో నివాసముంటున్నాడు. అక్కడా అద్దె చెల్లించకపోవడంతో లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి చిలకలగూడలోని ఓ ప్రైవేట్‌ స్కూలు గోడకు ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్‌పై ఉంటున్నాడు. ఈ నెల 13న ఆ ప్రాంతంలో ఆహారపు ప్యాకెట్ల పంపిణీ చేస్తున్న యువకుడు ఇమ్రాన్‌ను ఆపిన డ్రైవర్‌ కృష్ణారావు తన గోడు వెల్లబోసుకున్నాడు. తనకు ఆహారం కాదు..పని ఇప్పించాలని.. ఎక్కడైనా ఉండేందుకు వసతి కల్పించాలని కోరుకున్నాడు. ఆ సమయంలో ఆహార ప్యాకెట్లతో పాటు రూ. 2వేలు ఇచ్చిన ఇమ్రాన్‌ మరుసటి రోజు వస్తానని వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం వెళ్లి చూసే సరికి తల ఉబ్బి.. ముఖంపై గాయాలతో కృష్ణారావు ఏడుస్తూ కనిపించాడని ఇమ్రాన్‌ చెప్పారు. ఏం జరిగిందని ప్రశ్నించగా కొంతమంది వచ్చి తనను కొట్టి తన వద్ద ఉన్న డబ్బు లాక్కెళ్లడంతో పాటు తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పాడు. దీంతో చలించి పోయిన ఇమ్రాన్‌ అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి… తన ఇంట్లోనే ఓ పక్కన గది కేటాయించి వారి బాగోగులు చూస్తున్నాడు. వారికి రేషన్‌ సరుకులు, స్టవ్‌ అందజేసి వండుకునే అవకాశం కల్పించాడు. తన యూట్యూబ్‌ ఛానెల్‌ నిమిత్తం వీడియో రికార్డు చేయగా… ఆ వీడియో వైరల్‌గా మారి వేల మంది ఆ కుటుంబాన్ని సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఆ కుటుంబం పట్ల కనికరం చూపిన ఇమ్రాన్‌ను నెటిజన్లు పొగడుతున్నారు.
చీమ కనిపించినా దాని ప్రాణానికి ఎలాంటి హాని కలగవద్దనే ఆలోచన చిన్నప్పటి నుంచే ఉందని ఇమ్రాన్‌ చెప్పారు. జంతు ప్రేమికుడిగా గుర్తింపు పొందిన సికింద్రాబాద్‌కు చెందిన ఇమ్రాన్‌ అనే యువకుడు ఏ ప్రాణి ఆపదలో ఉన్న సాయం చేయడానికి అక్కడ వాలిపోతుంటాడు. తాన చేసే పనులను వీడియో రికార్డు చేసి తనకు సంబంధించిన యూట్యూబ్‌ ఛానెల్‌ ‘‘పరేషాన్‌ బాయ్‌’’లో అప్‌లోడ్‌ చేస్తాడు. దాంతో వచ్చే ఆదాయాన్ని మళ్లీ ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోడానికే ఖర్చు పెడుతుంటాడు. అతని దినచర్యలో భాగంగా తెల్లవారు జాము నుంచే రోడ్లపై వేట ప్రారంభిస్తాడు. మనుషులు, జంతువులు ఏవి ఇబ్బందుల్లో కనిపించినా అక్కడ వాలిపోయి వారి సమస్య తీర్చే పనిలో నిమగ్నమైపోతాడు. ఇదే క్రమంలో మే నెల 13న అతను తలపెట్టిన ఓ కార్యం ట్విట్టర్‌ మాధ్యమంలో వేలాది మందిని ఆలోచింప చేసింది. ఆ పని అంత వైరల్‌ అవుతోందని తాను ఊహించలేదని.. అలవాటులో భాగంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడంతో ఇంటర్నెట్‌లో తనపై కురుస్తున్న ప్రశంసల జల్లుతో తడిచి పోయానని చెబుతున్నాడు ఇమ్రాన్‌.
సొంత ఊరు వదిలి హైదరాబాద్‌లో బతకడానికి వచ్చిన కృష్ణారావు ఉదంతం వైరల్‌గా మారడంతో కృష్ణారావును ఆదుకోడానికి పలువురు ముందుకొచ్చారు. ఇమ్రాన్‌ ఫోన్‌నెంబర్‌, చిరునామా సేకరించిన పలువురు దాతలు అతని ద్వారా బాధితున్ని పరామర్శించారు. పోలీస్‌ శాఖ నుంచి కూడా సంప్రదించి అతనికి డ్రైవర్‌ ఉద్యోగం ఇప్పించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇమ్రాన్‌ తెలిపాడు. ఉద్యోగంతో పాటు సాయం చేయడానికి ముందుకొచ్చారు. కృష్ణారావు లాంటి ఎంతో మంది అభాగ్యులు రోడ్ల మీద ఉన్నారన్న విషయాన్ని గుర్తించి దాతలు సాయం చేయాలని ఇమ్రాన్‌ కోరాడు.

Leave a Reply