
ఏదైనా నేరం జరిగితే దానిని ఎంత విజయవంతంగా.. ఎంత వేగంగా చేదించారన్నది ముఖ్యం. ఈ రెండిటిలోనూ మహబూబాబాద్ పోలీసులు విఫలమయ్యారన్నది స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసు విషాధంతో ముగియడం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఈ సంఘటనతో గత నాలుగు రోజులుగా సాగుతున్నఉత్కంఠతకు తెర లేచినా.. పోలీసుల తీరుపై అనేక ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులదే. దీనికోసం వారికి కొన్ని నెలలపాటు ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. నేరం జరిగినవెంటనే కేసులు సాధ్యమైనంత త్వరగా చేదించడంతో పాటు విజయవంతంగా చేదించడం కూడా అత్యంత కీలకం. విదేశాల్లో అయితే కిడ్నాప్ జరిగితే నిందితులను పట్టుకోవడం కంటే చెరలో ఉన్న వారిని విడిపించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే నిందితులను భవిష్యత్తులో ఎప్పుడైనా పట్టుకోవచ్చు. కాని కిడ్నాప్ కు గురైనవారికి ఏమైనా జరిగితే పోయిన ప్రాణాన్ని, ఆ కుటుంబం కడుపు శోకాన్ని తిరిగి తేలేము కాబట్టి. ఇక మహబూబాబాద్ కేసు విషయానికి వస్తే.. కిడ్నాప్ కు గురైన బాలుడు దీక్షిత్ రెడ్డి ప్రాణం కాపాడలేకపోయారు. కేసును నాలుగు రోజుల తర్వాత అయినా చేదించడం తమ విజయంగా పోలీసులు పేర్కోవడం వారి ఘనతగా భావించవచ్చా..?
300 మంది పోలీసులు.. 4 రోజులు గాలింపు
దీక్షిత్ కిడ్నాప్ విషయం మీడియాలో రాగానే రాష్ట్రవ్యాప్తంగా చర్చనియాంశంగా మారింది. సాధారణంగా ఇలాంటి సంచలనం విషయంలోనే పోలీసులు వేగంగా స్పందిస్తారు కాబట్టి.. నిందితుడి కోసం వెంటనే ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం అయినప్పటికీ.. ఆ కేసు కోసం వరంగల్ పోలీసు కమిషనరేట్ తో పాటుగా రాష్ట్ర రాజధాని నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కిడ్నాప్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగితే.. పోలీసులు ఆరోజు రాత్రి నుంచే గాలింపు చర్యలు చేపట్టాయి. స్థానిక, ఇతర ప్రాంతాల పోలీసు సిబ్బందితో పాటు కేసుల చేదనలో నిష్ణాతులైన అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఎట్టకేలకు ఒక సీసీ కెమెరాలో లభించిన ఫుటేజి ఆధారంగా కేసు చేదించగలిగారు. ఇంతచేసినా బాలుడి ప్రాణాలు కాపడటంలో మాత్రం విఫలమయ్యారు. ఈ కేసంతా పరిశీలిస్తే పోలీసులు కాస్త ఆలస్యంగానైనా నిందితులను పట్టుకుంటారన్నది స్పష్టమైనా.. కిడ్నాప్ అయితే ప్రాణాలు కాపాడి కేసును విజయవంతంగా చేదించడం మాత్రం అనుమానమేనన్నది కూడా తెలిసింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పడు.. కిడ్నాపర్ల బారి నుంచి పోలీసులు కాపాడితే వారిపై, పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. నేరాలోచన ఉన్నవారిలో భయం కలుగుతుంది. కాని మహబూబాబాద్ సంఘటన.. పోలీసులు, పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచడంలో సగం మాత్రమే విజయవంతంమైంది.