మైనర్‌ బాలికతో…57ఏళ్ల వృద్ధుడి పెళ్లి
ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు

0
239


హైదరాబాద్‌: మనవారలి వయస్సున్న 16ఏళ్ల అమ్మాయితో కేరళకు చెందిన 57ఏళ్ల వృద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. బాలిక పిన్ని, ఆమె భర్త డబ్బుకు కక్కుర్తి పడి చేసిన ఈ నిర్వాకానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఈ వ్వవహారంతో లింకై ఉన్న… మైనర్‌ బాలికనిచ్చి పెళ్లి చేసిన కేసులో ఆరుగురిని ఫలక్‌నుమా పోలీసులు అరెస్టు చేశారు. మనవరాలి వయస్సున్న బాలికతో పెళ్లి చేసుకున్న వృద్ధునితో సహా ఓ బ్రోకర్‌ పరారీలో ఉన్నారు. బాలికతో పెళ్లి చేసుకున్న వృద్ధునిపై పోక్సో, అత్యాచారం చట్టం కింద కేసు నమోదు చేశారు. డబ్బులు తీసుకుని పెళ్లికి ఒప్పించిన మైనర్‌ బాలిక పిన్ని, ఆమె భర్తను, వరసకు సోదరుడు (పిన్ని కుమారుడు), మధ్యవర్తులుగా వ్యవహరించిన ఇద్దరు బ్రోకర్లను, పెళ్లి జరిపించిన ఖాజీలపై బాల్యవివాహం చట్టం, తప్పుడు పత్రాలు సృష్టించి పెళ్లి చేసినందుకు ఫోర్జరీ కేసులు నమోదు చేసి గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు సౌత్‌జోన్‌ డీసీపీ గజరావు భూపాల్‌ ఫలక్‌నుమా ఏసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పెళ్లి చేసుకున్న వృద్ధుడు, మరో బ్రోకర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారికోసం గాలిస్తున్నామని… వృద్ధుడు కేరళకు పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు అతన్ని పట్టుకోడానికి ఓ ప్రత్యేక బృందాన్ని కేరళ పంపిస్తున్నట్లు వెల్లడించారు.
డబ్బుకు ఆశపడి
ఫలక్‌నుమా తీగల్‌కుంటా ప్రాంతానికి చెందిన వ్యక్తి భార్య మృతి చెందడంతో అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. తండ్రి అనారోగ్యానికి గురి కావడం.. సొంత సోదరుడు చిత్రహింసలకు గురి చేస్తూ వేధించడంతో ఆ బాలిక (16) పోలీసులను ఆశ్రయించింది. దీంతో అప్పట్లో పోలీసులు ఆమెను బాలికల వసతి గృహానికి తరలించారు. ఇదే అవకాశంగా భావించిన పిన్ని ఆ బాలికను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని భావించింది. వసతి గృహం నుంచి పిన్ని ఆమెకు నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంది. బాలిక ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఆమెకు బ్రోకర్లు తారస పడ్డారు. బండ్లగూడలో పెళ్లి సంబంధాల పేరిట బ్రోకర్‌ దందా చేస్తున్న మహమ్మద్‌ అబ్దుల్‌ రహ్మాన్‌, వసీమ్‌ఖాన్‌తో పాటు మరో బ్రోకర్‌ కలిసి అమ్మాయి పెళ్లి చేస్తే డబ్బులిప్పిస్తామని చెప్పారు. డబ్బుకు ఆశ పడ్డ బాలిక పిన్ని ఒప్పుకుంది. కేరళకు చెందిన అబ్దుల్‌ లతీఫ్‌ పరంబాన్‌ (57) అక్కడే తన కుటుంబాన్ని వదిలి ఇక్కడ ఓ మసీదులో పని చేస్తున్నాడు. అతనికిచ్చి పెళ్లి చేస్తే రూ. 2.5లక్షలిప్పిస్తామని బ్రోకర్లు చెప్పారు. వెంటనే బాలికను ఒప్పించి పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లి తంతు నిర్వహించడానికి మలక్‌పేట్‌కు చెందిన ఖాజీ మహమ్మద్‌ బదియుద్దీన్‌ ఖాద్రీని సంప్రదించారు. తన ఏరియా అది కాదని ఆయన చెప్పగా.. అధిక మొత్తంలో చెల్లిస్తామని ఆయనను తీసుకొచ్చారు. డిసెంబర్‌ 27న పెళ్లి కుదుర్చుకున్నారు. పెళ్లి సమయంలో బాలిక వయస్సు ధృవీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు చూసి 16ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేయలేమని ఖాజీ చెప్పాడు. అయితే నోటి దాకా వచ్చిన డబ్బులు ఎక్కడ పోతాయోనని భావించిన పిన్ని, ఆమె భర్తతో పాటు బ్రోకర్లు వెంటనే మరో ప్లాన్‌ చేశారు. అప్పటికే పెళ్లయి ఉన్న తన పెద్ద కూతురు (బాలికకు వరసకు అక్క)కు సంబంధించిన ఆధార్‌కార్డు చూపడంతో ఆ పత్రాల ఆధారంగా ఖాజీ నికాహ్‌ తంతు పూర్తి చేశాడు. అదే రోజు రాత్రి బాలికను బండ్లగూడలోని రితాజ్‌ లాడ్జీకి తీసుకెళ్లిన వృద్ధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం సొంత సోదరుడికి తెలియడంతో మరుసటి రోజు (డిసెంబర్‌ 28న) సోదరుడు ఫలక్‌నుమా పోలీసులను ఆశ్రయించాడు. మైనర్‌ యైున తన సోదరిని చట్ట విరుద్ధంగా వృద్ధునికిచ్చి పెళ్లి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాలిక పిన్ని ఇంటిపై దాడి చేసి పిన్నిని, ఆమె భర్తతో పాటు వారి కుమారున్ని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి సహకరించిన బ్రోకర్లు మహమ్మద్‌ అబ్దుల్‌ రహ్మాన్‌, వసీమ్‌ఖాన్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. పత్రాలు లేకున్నా.. వేరే పత్రాల ఆధారంగా మైనర్‌ పెళ్లి జరిపినందుకు ఖాజీ బదియుద్దీన్‌ ఖాద్రీని కూడా అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకున్న వృద్ధుడు వెంటనే పారిపోయి తప్పించుకున్నాడు. బాలికను రక్షించి సంరక్షణ గృహానికి తరలించారు. పారిపోయిన వృద్ధునితో పాటు సహకరించిన బ్రోకర్‌కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply