
హైదరాబాద్: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు రెండు వారాల క్రితం వరసగా 7సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌గా ఉన్న తనకు వచ్చిన కాల్స్‌పైనే పోలీసుల స్పందన ఇలా ఉంటే మరి సామాన్య పౌరుని పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. 2020 జూలై 25న ఉదయం నుంచి రాత్రి వరకు 7 సార్లు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు ఫోన్ ద్వారా బెదిరించారు. మీడియాలో, యూట్యూబ్ ఛానెల్లో ఆయన మాట్లాడుతున్న అంశాల గురించి ప్రస్తావిస్తూ బెదిరించారు. అసభ్య పదజాలం, బూతులు ప్రయోగిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన అన్నారు. ఫోన్ నెంబర్ చూసి స్పందించకుంటే ఆ తర్వాత అదే రోజు ఆగంతకుడు ఇంటర్నెట్ ద్వారా మరో నాలుగైదు సార్లు ఫోన్ చేసి బెదిరించాడని నాగేశ్వర్ తెలిపారు. ఈ విషయమై ఆయన అదే రోజు హాక్ ఐ యాప్ ద్వారా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సంబంధిత నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు కేసు బదిలీ చేస్తున్నట్లు ఆయనకు సందేశం వచ్చింది.