18 మంది మహిళల హత్య.. సైకో కిల్లర్

0
303

హైదరాబాద్‌: ఒంటరి మహిళ కనిపిస్తే చాలు… అతనిలోని రాక్షసుడు మేల్కొంటాడు. తన మనస్సులో పేరుకుపోయిన కసితో ఆమైపై పలురకాలుగా దాడులు చేసి హతమారుస్తాడు. (లైంగిక దాడికి కూడా పాల్పడి ఉంటాడు… కానీ సంబంధించిన ఆధారాలు పోలీసుల వద్ద లేవు). చిన్నతనంలోనే (21ఏళ్ల వయస్సులో) పెళ్లి జరగడం… పెళ్లయిన కొన్నేళ్లకే భార్య పరాయి వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పారిపోవడంతో అప్పటి నుంచి మహిళల పట్ల ద్వేషం పెంచుకున్నాడని సమాచారం. అలా ఒకటి కాదు… రెండు కాదు… వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో ఏకంగా 18మంది మహిళలను హతమార్చాడు. కేవలం హత్యలు మాత్రమే కాకుండా దోపిడీలకు కూడా పాల్పడుతుంటాడు. 2019 వరకు అతనిపై 16 హత్యల కేసులు, నాలుగు దోపిడీ కేసులు నమోదై ఉన్నాయి. శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే ఓ సారి ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పారిపోయిన కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. గతేడాది జూలై నెలలో జైలు నుంచి విడుదలైన ఆ శాడిస్టు మరో ఇద్దరు మహిళలను హతమార్చాడు. అతనికోసం ఎంతో శ్రమించిన నార్త్‌జోన్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌తో పాటు రాచకొండ పోలీసులు ఎట్టకేలకు మరో సారి అదుపులోకి తీసుకున్నారు. అతని వృత్తి, ప్రవృత్తి, చరిత్ర… నేర చరిత్ర గురించి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నిందితుడి నేపథ్యం
సంగారెడ్డి జిల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనా రాములు (45) లేబర్‌గా పని చేసేవాడు. అక్కడి నుంచి నగరంలోని బోరబండ ప్రాంతానికి మకాం మార్చి 20ఏళ్లుగా అక్కడే నివసిస్తున్నాడు. అతని వయస్సు 21ఏళ్లు ఉన్నప్పుడే అతని వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని రోజులకే అతని భార్య పరాయి వ్యక్తితో పారిపోయింది. అప్పటి నుంచి మహిళలను చూడగానే అతనిలో కసి పెరిగేది. వారిపై విచక్షణా రహితంగా దాడులు చేస్తూ హత్యలు చేసేవాడు. 2003 నుంచి ప్రారంభమైన రాములు నేరాల యాత్ర ఈ ఏడాదిలో కూడా కొనసాగింది. అతను చేసిన మహిళల హత్యలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
2003లో మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పీఎస్‌ పరిధిలో
2004లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పీఎస్‌ పరిధిలో
2005లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ సంగారెడ్డి రూరల్‌ పీఎస్‌ పరిధిలో
2007లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పీఎస్‌ పరిధిలో
2008లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ దుండిగల్‌ పీఎస్‌ పరిధిలో
2008లో మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పీఎస్‌ పరిధిలో
2009లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ నార్సింగి పీఎస్‌ పరిధిలో (ఈ కేసులో జీవిత ఖైదు)
2009లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలో
2009లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ కూకట్‌పల్లి పీఎస్‌ పరిధిలో మరో హత్య
2012లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో
2013లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో మరో హత్య
2012లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ చందానగర్‌ పీఎస్‌ పరిధిలో
2012లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ చందానగర్‌ పీఎస్‌ పరిధిలో మరో హత్య
2012లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ దుండిగల్‌ పీఎస్‌ పరిధిలో
2019లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ షామీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలో
2019లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పటాన్‌చెరు పీఎస్‌ పరిధిలో మొత్తం 16 హత్యలు చేశాడు.
దోపిడీలు
2005లో షామీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలో
2005లో మేడ్చల్‌ పీఎస్‌ పరిధిలో
2009లో రాయదుర్గం పీఎస్‌ పరిధిలో
2013లో ఐడీఏ బొల్లారం పీఎస్‌ పరిధిలో మొత్తం నాలుగు దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
2011లో శిక్ష పడిన తర్వాత ఎస్సార్‌ నగర్‌ పీఎస్‌ పరిధి నుంచి తప్పించుకోగా.. ఆ కేసు కూడా ఉంది.
తాజాగా రెండు హత్యలు
ఇలా మొత్తం 21 కేసుల్లో నిందితుడిగా ఉన్న మైనా రాములు తాజా అరెస్టుతో రెండు హత్య కేసు మిస్టరీలు వీడాయి. ఈ ఏడాది జనవరి 1న జూబ్లీహిల్స్‌ వెంకటగిరి నివాసి కావల అంనతయ్య (60) జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు వచ్చి తన భార్య కావల వెంకటమ్మ (50) గతేడాది డిసెంబర్‌ 30 నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. తాజాగా అరెస్టు అయిన మైనా రాములును విచారించగా ఆమెను ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అలాగే బాలానగర్‌ పీఎస్‌ పరిధిలో అదృశ్యమైన సుమారు 40ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని మహిళను బాలానగర్‌ కాంపౌండ్‌ వద్ద నుంచి సిద్దిపేట జిల్లా ములుగు పీఎస్‌ పరిధిలో హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహం లభించినప్పటికీ ఆ మహిళ వివరాలు పోలీసులకు ఇంకా తెలియరాలేదు. తాజా రెండు హత్యలతో కలిపితే సీరియల్‌ కిల్లర్‌ మొత్తం 18మంది మహిళలను పొట్టన పెట్టుకున్నట్లు తెలిసింది.
జీవిత ఖైదు విఽధించినా…
సైబరాబాద్‌ కమిషనరేట్‌ నార్సింగి పీఎస్‌ పరిధిలో 2009లో జరిగిన హత్య కేసుతో పాటు ఓ దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న మైనా రాములును పట్టుకోడానికి అప్పటి ఎస్‌ఓటి ఇన్‌స్పెక్టర్‌ రాధాకిషన్‌రావు తన బృందాలతో తీవ్రంగా శ్రమించారు. నిందితున్ని పట్టుకుని ఆధారాలు సేకరించి నార్సింగి పోలీసులకు అప్పగించారు. పోలీసులు చార్జిషీటు దాఖలు చేసి హత్యలతో పాటు దోపిడీకి పాల్పడ్డ నిందితున్ని దోషిగా నిర్ధారించిన రంగారెడ్డి జిల్లా నాలుగో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు జడ్డి 2011 ఫిబ్రవరి 21న జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. జీవితఖైదు కొనసాగుతున్న సమయంలో అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో 2011 డిసెంబర్‌ 1న అతన్ని ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో చేర్చారు. ఆ తర్వాత మరో ఐదుగురు ఖైదీలతో ప్లాన్‌ చేసిన రాములు అదే ఏడాది డిసెంబర్‌ 30న ఎస్కార్ట్‌ కళ్లు గప్పి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ మేరకు ఎస్సార్‌ నగర్‌ పీఎస్‌లో ఓ కేసు నమోదై ఉంది. అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత నిందితుడు 5హత్యలు చేశాడు. బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో –2, చందానగర్‌ పీఎస్‌ పరిధిలో–2, దుండిగల్‌ పీఎస్‌ పరిధిలో ఓ హత్య చేశాడు. ఎట్టకేలకు 2013 మే 13న బోయిన్‌పల్లి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు వరసగా జైల్లో ఉన్న రాములు హైకోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ వేసుకుని కోర్టు క్షమాభిక్షతో 2018 అక్టోబర్‌ 3న జీవిత ఖైదు నుంచి విముక్తి పొంది జైలు బయటకు వచ్చాడు.
తీరుమారని సీరియల్‌ కిల్లర్‌
జీవితఖైదు నుంచి మినహాయింపుతో జైలు బయటకు వచ్చినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. ఆ తర్వాత కూడా షామీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలో ఒకటి, పటాన్‌చెరు పీఎస్‌ పరిధిలో మరో మహిళ హత్య చేశాడు. ఆ కేసుల్లో షామీర్‌పేట్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన తర్వాత గతేడాది జూలై 31న జైలు చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. అయినా తీరుమారని సైకో కిల్లర్‌ 2020 డిసెంబర్‌ 10న బాలానగర్‌ ప్రాంతానికి వెళ్లాడు. సుమారు 40ఏళ్ల వయస్సున్న ఓ గుర్తు తెలియని మహిళను మాయమాటలు చెప్పి మద్యం తాగుదామని తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెకు డబ్బులు ఇస్తానని ఆశ చూపి సిద్దిపేటలోని ములుగు పీఎస్‌ పరిధిలోని జప్తా సింగాయపల్లి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెను ఆమె చీర బిగించి హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న నగలను తస్కరించాడు. ఆ మహిళకు సంబంధించి బాలానగర్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తిరిగి నగరానికి వచ్చిన రాములు గతేడాది డిసెంబర్‌ 30న కావల వెంకటమ్మను కూడా మాయ మాటలు చెప్పి యూసుఫ్‌గూడా టాడీ కాంపౌండ్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తలపై బండరాయితో మోది హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న విలువైన వస్తువులను తస్కరించి పారిపోయాడు.
500 సీసీటీవీల జల్లెడ
మహిళల హత్యలకు సంబంధించి సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీరియల్‌ కిల్లర్‌ను అనుమానించి అతని కదలికల గురించి ఆరా తీశారు. ఘట్‌కేసర్‌ పీఎస్‌ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసు విచారణలో భాగంగా యూసుఫ్‌గూడ నుంచి ఘట్‌కేసర్‌లో హత్య జరిగిన ప్రాంతం వరకు 500 సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. రాములు ఆమెను తీసుకెళ్లి హతమార్చినట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు మంగళవారం నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితున్ని రాచకొండ కమిషనరేట్‌లోని ఘట్‌కేసర్‌ పోలీసులకు అప్పగించారు.

Leave a Reply