పెరోల్ పై వచ్చాడు… పోలీసుల రివాల్వర్ కొట్టేశాడు

0
291

జైలు నుంచి పెరోల్ పై బయటకు వచ్చిన ఓ ఘరానా నేరస్తుడు ఏకంగా పోలీసుల దగ్గరే తన చేతివాటం చూపించాడు. ఓ రివాల్వర్ కాజేయడం పాటు దానితో నగల దుకాణం దోచుకోవడానికి ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నాడు. చివరి నిమిషంలో పోలీసులకు చిక్కాడు. దక్షిణ దిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి సెంట్రల్ డిస్ర్టిక్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ భాటియా వివరాలు వెల్లడించారు. ఆ ప్రకారం… నిందితుడు అతుల్ ఓ దోపిడీ కేసులో సెప్టెంబరులో జైలుకెళ్లి 45 రోజుల ఫెరోల్ పై బయటకు వచ్చాడు. వచ్చీ రాగానే తన చేతివాటం చూపడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే దక్షిణ దిల్లీలోని కిషన్ ఘర్ అనే ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. డబ్బు, నగలు కోసం అక్కడ గాలించగా ఓ సంచిలో రివాల్వర్, పది తూటాలు కనిపించాయి. వచ్చినంత వరకు లాభం అనుకుని, రివాల్వర్ ఉంటే సులువుగా దోపిడీ చేయొచ్చని భావించి వాటిని కొట్టేశాడు. ఆ ఇంట్లో ఐదుగురు పోలీసులు అద్దెకు ఉంటున్నారనే విషయం అప్పటికి తెలియదు. రివాల్వర్ అదృశ్యం గురించి సంబంధిత కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో చోరీ చేసిన రివాల్వర్ సాయంతో ఓ బంగారు నగల దుకాణం దోచుకోవడానికి నిందితుడు మరో ఇద్దరితో ప్లాన్ చేసి దానిని అమల్లో పెట్టడానికి కరోల్ బాగ్ అనే ప్రాంతానికి వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని అతడితో పాటు మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈనెల 30తో నిందితుడి పెరోల్ గడువు ముగియనుండటం గమనార్హం.

Leave a Reply