
హైదరాబాద్: పెళ్లయిన 45రోజులకే అత్తింట్లో కన్న కూతురు కన్నుమూయడాన్ని ఆ దంపతులు జీర్ణించుకోలేక పోతున్నారు. నలుగురు ఆడపిల్లల్లో పెద్దకూతురైన ఫిర్దౌజ్బేగం (19)ను ఎన్నో ఆశలతో గత నవంబర్ 5న పెళ్లి చేసి అత్తింటికి సాగనంపారు. సంచార రైతుబజార్లలో కిరాయి ఆటోలో ఫ్రూట్స్ అమ్ముకుని బతికే ఆ దంపతులు కూతురి పెళ్లికి రూ. 6లక్షలు అప్పు చేసి ఘనంగా జరిపించారు. పెళ్లి అయిన నెలన్నర వ్యవధిలోనే కూతురి అనుమానాస్పద మరణం వెనక కారణాలను గుర్తించి కారకులను శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. షాపూర్, జీడిమెట్లలో నివాసముంటున్న ఫిర్దౌజ్ బేగం తల్లి షబానాబేగం, తండ్రి సయ్యద్ జహాంగీర్లను కదిలిస్తే కన్నీటి పర్యంతమయ్యారు. పేద కుటుంబమైనప్పటికీ.. పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా కాపాడుకున్నామని… నలుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారని చెప్పారు. పెద్ద కూతురి పెళ్లికి అప్పు చేసి ఘనంగా జరిపించినప్పటికీ అత్తింటి ఆరళ్లకు బలైందని చెప్పారు. పాతబస్తీ బండ్లగూడ నివాసి మహమద్ ఇక్బాల్‌తో పెళ్లి జరిగింది. వివాహ సమయంలో రెండు తులాల బంగారు ఆభరణాలు, వెండి, ఇతర సామాగ్రి, ఎలకా్ట్రనిక్ వస్తువులు, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్‌లతో పాటు పెళ్లి కొడుకు తరపు వారు అడిగిన కట్నాన్ని అందించారు. కూతురు చనిపోయిన బాధతో పాటు తమపై రూ. 6లక్షల అప్పు మిగిలిందని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూతురి అనుమనాస్పద మృతి వెనక కారణాలను ఆరా తీయాలని… కారకులైన వారిని శిక్షించాలని వారు చాంద్రాయణగుట్ట పోలీసులను కోరుతున్నారు. ఈ మేరకు వివిధ స్థానిక పార్టీ నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మృతురాలి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారిని ఓదార్చారు. దర్యాప్తులో పోలీసులు అంతగా స్పందించడం లేదని… ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసును వేగవంతంగా విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కుటుంబీకులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు శిక్ష విధించేంత వరకు నిందితునికి బెయిల్ రాకుండా చాంద్రాయణగుట్ట పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.