ర‌క్షించండి.. యుఏఈ నుంచి పాత‌బ‌స్తి యువ‌తి వీడియో

0
285

హైదరాబాద్/షార్జా: ఓ మహిళా ట్రావెల్‌ ఏజెంట్‌ మాయమాటలు నమ్మిన పాతబస్తీ యువతి యూఏఈలో చిక్కుకుంది. రూ. 2లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన సూడాన్‌ దేశస్థుడు ఆమెపై వరసగా మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. తేరుకున్న ఆ యువతి సూడాన్‌ దేశస్థుడిపై ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనపై జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ… రోదిస్తూ పంపిన వీడియో ఆధారంతో కూతురికి సాయం చేసి… న్యాయం చేయాలంటూ బాధిత యువతి తల్లి ఎంబీటీ నేత వద్దకు వచ్చింది. వివరాలు సేకరించిన ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్‌ సానుకూలంగా స్పందించారు. మోసానికి గురై దుబాయ్‌లో చిక్కుకున్న యువతిని రక్షించి స్వదేశానికి తరలించాలంటూ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు, విదేశాంగ శాఖకు లేఖలు రాశారు. బండ్లగూడ, ఉందాహిల్స్‌కు చెందిన యువతి శంషీర్‌గంజ్‌లోని ఓ ఆస్పత్రిలో గతంలో నర్సుగా పనిచేశారు. ఆస్పత్రిలో పని చేస్తున్న సమయంలో వట్టేపల్లి ప్రాంతానికి చెందిన ఫాతిమా అనే మహిళతో ఆమెకు పరిచయం ఏర్పడింది. యూఏఈ నగరం షార్జాలో ఓ ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం ఉంది…అక్కడికి వెళ్తావా అని బాధిత యువతిని ఫాతిమా ప్రశ్నించింది. నెలకు రూ. 40వేలు జీతం ఉంటుందని చెప్పడంతో… కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున అక్కడికి వెళ్లి సంపాదించాలని ఆశించింది. ఫాతిమా అనే ఏజెంటు సూచనల మేరకు గత నెల 15న ఆమె షార్జా చేరుకుంది. అక్కడికి చేరిన తర్వాత ఆమెను సూడాన్‌ దేశానికి చెందిన అమ్మార్‌ అహ్మద్‌ ఉమర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి వచ్చి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. మరో యువతిని రప్పించడానికి అతనింటికి వెళ్లగా… బాధిత యువతికి పరిచయమున్న మరో హైదరాబాదీ యువతి కనిపించింది. ఆమెను కూడా ఫాతిమా అనే ఏజెంటు ఇక్కడికి పంపించినట్లు వివరించింది. సూడాన్‌ దేశస్థుడు పెడుతున్న చిత్రహింసలు భరించలేక హైదరాబాద్‌ తిరిగి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు యువతి వివరించింది. ఆమె మోసానికి గురైందని హైదరాబాద్‌లో ఫాతిమా అనే ఏజెంటును ఆ యువతి బంధువులు వేధించడంతో ఆమెను రక్షించడానికి తాజాగా వచ్చిన యువతిని ఎర వేసి ఉంటారని ఆమె చెప్పింది. దీంతో అప్పటికే ఆలస్యమైపోయిందని గ్రహించిన బాధిత యువతికి ఏం చేయాలో తోచలేదు. రూ. 2లక్షలు తీసుకుని తనను ఇక్కడికి విక్రయించినట్లు… ఆమెను తిరిగి రప్పించడానికి తాజాగా ఈ యువతిని పంపించారని ముందు నుంచి అక్కడే ఉన్న యువతి వివరించింది.
మూడు రోజుల పాటు అత్యాచారం..
అక్కడ ఉన్న యువతిని వెనక్కి పంపించివేసిన సూడాన్‌ దేశస్థుడు చిక్కుకున్న యువతిని వరసగా మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురి చేస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహ కోల్పోయినా ఆమెను వదలకుండా వికృత చేష్టలకు పాల్పడ్డాడని ఆ యువతి రోదిస్తూ వీడియో పంపించింది. కాస్త కోలుకున్న తర్వాత ఆమె అక్కడి పోలీసుల వద్దకు ఎలాగోలా చేరి తన గోడు వెల్లబోసుకుంది. అక్కడి పోలీసుల సాయంతో ఆమె తన గోడును తల్లికి వివరించింది. ఆమెను రక్షించి తన వద్దకు చేర్చాలని ఎంబీటీ నేతకు కోరగా ఆయన విదేశాంగ శాఖను సంప్రదించారు.

Leave a Reply