నేరస్తులు, రాజకీయ నేతల మధ్య బంధం భారత రాజకీయాల్లో కొత్తేమీ కాదు. నేరస్తులే రాజకీయాలను ఏలుతున్న ప్రస్తుత తరుణంలో నేతలు, నేరస్తులను వేరు చేసి చూడలేం. రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడైనట్లు… నేటి నేరగాళ్లే రేపటి ప్రజాప్రతినిధులు కావచ్చు. ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవలే పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన పేరుమోసిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబే రాజకీయ నేత అన్న విషయం చాలామందికి తెలియదు. యూపీలోని కాన్పూర్ కేంద్రంగా తన నేర సామ్రాజ్యం స్థాపించిన వికాస్ దూబే ఒకప్పటి బీజేపీ, ప్రస్తుతం బీఎస్పీ రాష్ట్ర నేతగా ఉన్న హరికిషన్ శ్రీవాస్తవకు ప్రధాన అనుచరుడు. ఆయన ఆశీస్సులతోనే జిల్లాస్థాయి రాజకీయనేతగా ఎదగడమే కాకుండా.. తన భార్య రీచా దూబేను సైతం సమాజ్ వాదీ పార్టీ తరపున స్థానిక ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించాడు. బీఎస్పీ పార్టీలో ఉన్నప్పటికీ.. అన్ని పార్టీల జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాడు. 56 సంవత్సరాల దూబే తన 20వ ఏట నుంచే తనకంటూ ఓ ప్రత్యేక గ్యాంగ్ ఏర్పాటు చేయడమే కాకుండా.. 2001లో బీజేపీ నేత, అప్పటి కేంద్ర సహాయమంత్రి సంతోష్ శుక్లా హత్య కేసులో ప్రధాన నిందితుడు కూడా. 1990 నుంచి ఇప్పటివరకు అనేక హత్యలు, భూకబ్జాలు, బెదిరింపులకు సంబంధించిన కేసులు దూబేపై ఉన్నాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ.. ఇలా అధికారంలో ఏ పార్టీ ఉన్నా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పోలీసులు, ఉన్నతాదికారులు ఇతడిని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటూనే ఉన్నారు. కేంద్ర సహాయమంత్రి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా.. జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి కారణం రాజకీయ సహకారమే.

మొన్న జులై 3న తనను అరెస్టు చేయడానికి వచ్చిన 8 మంది పోలీసులను (డీఎస్పీతో పాటు) అత్యంత క్రూరంగా హతమార్చిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతోనే అతడు పోలీసు బుల్లెట్లకు నేలకొరిగాడు. అంతకు ముందు రోజు అరెస్టు తర్వాత అతడు తనకు సహకరించిన రాజకీయ నేతలు, పోలీసులు, ఉన్నతాధికారుల పేర్లను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందించాడు. వికాస్ దూబే వాంగ్మూలాన్ని రికార్డు చేసి సీడీని అక్కడి ప్రభుత్వానికి సమర్పించారు. వీరిలో 11 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నలుగురు ప్రముఖ వ్యాపారులు, ఐదుగురు ఉన్నతాధికారులు కూడా అతడికి సహకరించే వారి జాబితాలో ఉన్నారు. అతడు బతికి ఉండి ఉంటే కేసు విచారణలో వీరందరి పేర్లు బయటికి వచ్చేవేమో. పోలీసుల ఎన్ కౌంటర్ వల్ల అతడితో పాటు 11 మంది మంత్రులు, ఎమ్మెల్యేల తెరవెనుక కుమ్మక్కు రాజకీయాలు కూడా సమాధి అయ్యాయి.