చిన్నారుల భద్రతకు ‘వీ కెన్‌’

0
185

హైదరాబాద్‌: చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అడ్డుకునేందుకు భరోసా తరపున ‘వీ కెన్‌’ ప్రచార పర్వం ప్రారంభమైంది. చిన్నారులపై జరిగే ఏ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దశలో అడ్డుకునేలా అవగాహన కల్పించడానికి ఈ ప్రచారం ప్రారంభమైంది. శనివారం నాంపల్లిలోని భరోసా సెంటర్‌లో ‘వీ కెన్‌’ కార్యక్రమాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా మిస్‌ ఇండియా వరల్డ్‌ –2020, మానస వారణాసి హాజరయ్యారు. చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులను అరికట్టడం… గుర్తించి చర్యలు తీసుకోవడంలో తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులపై ఎంతో బాధ్యత ఉందని వర్ణించారు. వీ కెన్‌ పేరిట ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి.. సామాజిక మాధ్యమాలు, పాఠశాలల్లో కార్యక్రమాలు, వివిధ మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించడానికి నగర పోలీసులు నడుం కట్టారు. అవగాహన కల్పించడమే కాకుండా.. చిన్నారుల రక్షణార్థం ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధం చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. నగరంలోని ప్రతి చిన్నారికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించి వారికి రక్షణ కల్పించేందుకే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గత ఐదేళ్లుగా రేయింబవళ్లు పని చేస్తున్న భరోసా సెంటర్‌ చిన్నారుల రక్షణకే అంకితమైందని భరోసా అధికారులు పేర్కొన్నారు. బాధిత చిన్నారులకు అండగా, వారిపై జరిగిన అఘాయిత్యాలను మరిచిపోయేలా చేసుందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. బాఽధిత చిన్నారులకు వైద్య, న్యాయ పరమైన సేవలతో పాటు ప్రత్యేక కౌన్సెలింగ్‌ విభాగం ఏర్పాటు చేసి ఇప్పటివరకు 10వేల కుటుంబాలకు ఏదో ఓ విధంగా సాయం చేయగలిగామని పేర్కొన్నారు. అతి తక్కువ వ్యవధిలో ఫిర్యాదు, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం, తక్కువ వ్యవధిలో దర్యాప్తు, విచారణ.. వెంటనే చార్జిషీట్‌, వెను వెంటనే నిందితులకు రికార్డు సమయంలో శిక్షలు పడేలా, బాధితులకు పరిహారం అందేలా చూస్తున్నామన్నారు.
భరోసా చర్యలను, వీ కెన్‌ ప్రాజెక్టులో మానస వారణాసి సహకారాన్ని సీపీ అంజనీకుమార్‌ ప్రశంసలతో ముంచెత్తారు. నగరంలోని 66 లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌స్టేషన్ల నుంచి వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకుని ఇప్పటి వరకు 86మందికి శిక్షలు పడేలా విచారించడంలో భరోసా పనితీరును అభినందించారు. ఎన్నో ఒడిదొడుకులను అధిగమించి ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌గా ఎంపికైన మానసను సీపీ అభినందిస్తూ చిన్నారుల రక్షణార్థం ఆమె తీసుకున్న చొరవను కొనియాడారు. చిన్నారుల భద్రత.. వారిపై జరిగే అఘాయిత్యాలను నిలవరించడానికి ప్రారంభించిన వీ కెన్‌ ప్రచారంలో ఆమె పూర్తి స్థాయి సహకారం అందిస్తానని చెప్పడాన్ని సీపీ స్వాగతించారు. ఆమె పేరులోనే వారణాసి అని ఉండటాన్ని ఆయన 6వేల ఏళ్ల నాటి శంకరాచార్య ఘటనను ప్రస్తావిస్తూ స్త్రీ మహత్యాన్ని అభివర్ణిస్తూ మానసను అభినందించారు. చిన్నారుల భద్రతలో ఆమె సహకారంతో.. వీ కెన్‌ అమలు చేయడం మరింత సునాయాసమైందని సీపీ అన్నారు.
చిన్నారులకు పూర్తిస్థాయి భద్రత కల్పించి రానున్న తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు సీపీ (క్రైమ్‌, భరోసా సెంటర్‌) షికాగోయెల్‌ అన్నారు. వీ కెన్‌ ప్రాజెక్టు ద్వారా చిన్నారుల రక్షణ, వారి భద్రత విషయంలో అందరూ బాధ్యత తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఉమ్మడి కుటుంబాల్లో, పెద్దలు బిజీగా ఉన్న కుటుంబాలతో పాటు చిన్నారులున్న ప్రతి ఇంట్లో వారి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. గతంలో నిర్వహించిన షీ స్మార్ట్‌ కార్యక్రమం ద్వారా 100 స్కూళ్లలో ప్రచారం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో వీ కెన్‌ కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాలు, పాఠశాలల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు 1500 కేసుల్లో నిందితులకు శిక్షలు పడినట్లు ఆమె తెలిపారు. చిన్నారులకు సంబంధించి ఏమాత్రం అనుమానమున్నా.. ఆమె కుటుంబీకులు లేకున్నా… అక్కడున్న వారే రక్షకులుగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్దలందరూ ఏకతాటిపై చిన్నారుల రక్షణ, భద్రతకు కంకణం కట్టుకోవడమే ‘వీ కెన్‌’ ఉద్దేశ్యమన్నారు. ప్రచారాన్ని స్కూళ్లు మాత్రమే కాకుండా ఆస్పత్రులు, అనాథాలయాలు, వివిధ సమాహాల వద్ద ప్రచారం కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడుల నేపథ్యంలో పోక్సో చట్టం కింద శిక్షలు పడిన విషయాలను ఆమె గుర్తు చేశారు. ఒక్కొక్కరికి 25 ఏళ్ల నుంచి 30ఏళ్ల వరకు కోర్టు శిక్షలు విధించాయని ఉదాహరణలతో వివరించారు. బాధిత చిన్నారులకు రూ. 4 లక్షల నుంచి రూ. 8లక్షల వరకు అందిన పరిహారాన్ని ఆమె పేర్కొన్నారు.
గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌ను గుర్తించాలి: మానస
చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, లైంగిక దాడులను అరికట్టడానికి కంకణం కట్టుకుంటున్నానని మానస వారణాసి ప్రకటించారు. ఈ విషయంలో మహిళలకు, తల్లులకు, చిన్నారులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి తెలియజేయాలన్నారు. బాలికల రక్షణార్థం ఏర్పాటై ఉన్న 1098 నెంబర్‌ను అందరూ గుర్తించి.. ఎక్కడ అనుమానమున్నా వెంటనే కాల్‌ చేయాలని కోరారు. ఆ ప్రచారంలో భాగంగానే తాను 1098 మాస్కును ధరిస్తున్నానని మాస్కును చూపించారు. కేవలం లైంగిక వేఽధింపుల నుంచి మాత్రమే కాకుండా బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను కూడా నిర్మూలించాల్సిన ఆవశ్యకతను వివరించారు. చిన్నారుల రక్షణార్థ ప్రతి నిముషం కీలకమైందని.. అత్యవసరమున్నప్పుడు ఎక్కడా వెనకడుగు వేయరాదని పిలుపునిచ్చారు. వారి రక్షణార్థం తాను ఆ విషయాల్లో కట్టుబడి ఉండటమే కాకుండా ప్రచారంలో పాలు పంచుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ డి.దివ్య, సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి, షీటీమ్స్‌ అదనపు డీసీపీ శిరీష రాఘవేంద్రలతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

Leave a Reply