వాట్సాప్‌లో కత్తుల విక్రయ ప్రచారం… తీరా

0
181

హైదరాబాద్‌: ‘బాప్‌ బాప్‌ హీ హోతా బేటా! నామ్‌తో సునాహీ హోగా… షోనూ మాడల్‌ బోల్తే’ (తండ్రి తండ్రే అవుతాడు కొడకా! పేరు వినే ఉంటారు… షోనూ మాడల్‌ అంటారు) అని సోషల్‌ మీడియాలో ప్రచారం చేశాడు. కొత్తేముంది అనుకోవచ్చు… కానీ రెండు చేతుల్లో రెండు తల్వార్లు ఎత్తి… పోజిచ్చి… స్థానికంగా భయభ్రాంతులకు గురి చేయసాగాడు. అంతే కాకుండా కత్తులు, తల్వార్లు విక్రయించేందుకు ప్రచారానికి కత్తులతో దిగిన ఫోటో వాడుకున్నాడు. వైరల్‌గా మారిన ఫోటో టాస్క్‌ఫోర్స్‌ కంట పడింది. వెంటనే అతన్ని గాలించి గుర్తించి పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ అతని మత్తు దించేశారు. తల్వార్లు ఎక్కడి నుంచి సేకరించాడనే తీగ లాగితే మారణాయుధాలకు సంబంధించిన పెద్ద వ్యాపారమే గుట్టు రట్టయ్యింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల కథనం ప్రకారం… అత్తాపూర్‌, హైదర్‌గూడ నివాసి రతన్‌ రాజ్‌కుమార్‌ (55) అలియాస్‌ రాజు సిద్దిఅంబర్‌ బజార్‌లో మహవీర్‌ గిఫ్ట్స్‌ అండ్‌ నావెల్టీస్‌ పేరిట వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో అనుకున్నంత లాభాలు రాకపోవడంతో అక్రమ సంపాదనపై దృష్టి సారించాడు. పెళ్లిళ్ల సీజన్‌ సమీపిస్తుండటంతో.. బారాత్‌లు.. డాన్సుల నిమిత్తం కత్తులు, డాగర్లకు భారీ డిమాండ్‌ ఉంటుందని గ్రహించాడు. దానికోసం ఢిల్లీలో కత్తులు, డాగర్లు సరఫరా చేసే అక్రమ వ్యాపారులతో సంప్రదింపులు చేసి పెద్ద సంఖ్యలో కత్తులు, డాగర్లకు ఆర్డరిచ్చాడు. గిఫ్టులు ఇక్కడికి దిగుమతి చేసుకునే ట్రాన్స్‌పోర్టుతో మాట్లాడి.. గిఫ్టు ఆర్టికల్స్‌ చాటును కత్తులు, డాగర్లు తెప్పించుకుని సిద్ది అంబర్‌ బజార్‌లోని తన గొడౌన్‌లో దాచి పెట్టుకున్నాడు. వాటిని విక్రయించడానికి జియాగూడ నివాసి అంకిత్‌ లాల్‌ (21) అలియాస్‌ సోనును నియమించుకున్నాడు. పెళ్లిళ్లు, బారాత్‌లను పసిగట్టి కత్తులు, తల్వార్లు, డాగర్లకు ఆర్డర్‌ తీసుకొచ్చి వాటిని విక్రయిస్తే భారీ కమీషన్‌లు ఇస్తానని మాట్లాడుకున్నాడు. ఒక్కో తల్వార్‌ను రూ. 1200 నుంచి రూ. 1500 వరకు కస్టమర్‌ డిమాండ్‌ను బట్టి విక్రయించసాగారు. కమీషన్‌ పద్ధతిలో తల్వార్లు విక్రయిస్తున్న అంకిత్‌ లాల్‌ ఈజీగా విక్రయించడానికి సోషల్‌ మీడియాను వేదికగా మార్చుకున్నాడు. కత్తులు పట్టుకుని దిగిన ఫోటోలతో వాట్సాప్‌ గ్రూప్‌లలో ప్రచారం చేయసాగాడు. అతని స్నేహితుడైన బషీర్‌బాగ్‌ నివాసి సయ్యద్‌ ఖలీల్‌ (20) అలియాస్‌ సోను ప్లంబర్‌గా పని చేస్తుంటాడు. తల్వార్లు అధిక ధరలో విక్రయించి ఎక్కువ సంపాదిద్దామని భావించిన ఖలీల్‌ వాటి ధరలను రూ. 2500 నుంచి రూ. 3వేల వరకు పెంచేసుకుని వాటి ప్రచారం ప్రారంభించాడు. ఇదే క్రమంలో స్థానికంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోస్టులు పెడుతూ.. స్టేటస్‌లో పెట్టి విక్రయించసాగాడు. ఇది గమనించి టాస్క్‌ఫోర్స్‌ తొలుత బషీర్‌బాగ్‌లోని న్యూ హిల్స్‌ హోటల్‌ వద్ద ఖలీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు మిగతా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 87 చిన్న డాగర్లు, 8 తల్వార్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులతో పాటు స్వాధీనం చేసిన కత్తులను, సామాగ్రిని సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

Leave a Reply