Thursday, November 21, 2024

హైద‌రాబాద్ శివారులో డ్ర‌గ్స్ త‌యారీ

ఇంటర్‌పోల్‌ సమాచారంతో డీసీఏ దాడులు

రూ. 8.99కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ స్వాధీనం

హైద‌రాబాద్ మార్చ్ 22 నేరాలు-ఘోరాలు: హైద‌రాబాద్ శివారులో డ్ర‌గ్స్ త‌యారీ కేంద్రంపై డ్ర‌గ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేష‌న్ అధికారుల దాడిలో విస్తు గొలిపే వాస్త‌వాలు వెలుగు చూశాయి. ద‌ర్జాగా నిషేధిత డ్ర‌గ్స్ త‌యారు చేయ‌డ‌మే కాకుండా వాటిని యూర‌ప్ దేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్‌పోల్‌ నుంచి సమాచారం అందుకున్న డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు, ఎక్సైజ్‌ అధికారులతో జాయింట్‌ ఆపరేషన నిర్వహిచి డ్రగ్స్‌ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. అక్కడ నిల్వ ఉన్న భారీ మొత్తంలో రూ. 8.99 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, ఐడీఏ బొల్లారంలో ఉన్న పీఎస్‌ఎన మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో 3-ఎంఎంసీ పేరిట అక్రమంగా తయారవుతున్న సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్స ‘3-మెథైల్‌మెథ్‌క్యాథినోన (3ఎంఎంసీ)’ డ్రగ్స్‌ తయారు చేస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. మెటాఫిడ్రోన పేరిట కూడా ఈ డ్రగ్‌ వినియోగంలో ఉంటుందని.. డ్రగ్స్‌ వినియోగదారులు వీటిని వాడుతుంటారని అధికారులు చెప్పారు. పీఎస్‌ఎన మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి కస్తూర్‌ రెడ్డి నమెళ్లపూడి అనే వ్యక్తి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తయారు చేయడమే కాకుండా భారీ మొత్తంలో డ్రగ్స్‌ను ఇక్కడి నుంచి యూరోపియన దేశాలకు ఎగుమతి కూడా చేశారని అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు. కంపెనీలో నిల్వ ఉన్న రూ. 8.99కోట్లు విలువ చేసే 90.48 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. వైఎల్‌వి01 కోడ్‌తో ఉన్న డ్రగ్స్‌ పదార్థాలకు సంబంధిచి తయారీ వివరాలు కంపెనీ ప్రతినిధుల వద్ద లభించలేదు. ఇండియాతో సహా ప్రపంచంలోని పలు దేశాలు ఈ డ్రగ్స్‌ పై నిషేధం విధించాయని అయినా బ్లాక్‌ మార్కెట్‌ ద్వారా దందా సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అనుమానిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు డెరెక్టర్‌ కస్తూర్‌రెడ్డిని, ప్రొడక్షన మేనేజర్‌ కె.సుధాకర్‌ రెడ్డిని, క్వాలిటీ కంట్రోల్‌ ఇంచార్జి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి తెలిపారు.

Related Articles

Latest Articles