ట్రాఫిక్ సమస్యల పరిష్కారం.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో చర్యలపై చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 17: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గురువారం (అక్టోబర్ 17న) ట్రాఫిక్ అదనపు కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి. విశ్వప్రసాద్గా, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంయుక్తంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశానికి హైడ్రా అధికారులు, ట్రాఫిక్ విభాగానికి చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ విభాగంతో కలసి పని చేయాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. హైడ్రాకు చెందిన డీఆర్ ఎఫ్ బృందాలకు ట్రాఫిక్ నింయత్రణపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు లేని సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులతో కలసి హైడ్రా డీఆర్ ఎఫ్ బృందం కలిసి పని చేసేలా నిర్ణయించుకున్నారు. ముఖ్యమైన సమయాల్లో హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. వర్షం పడినప్పుడు వరద నీరు (వాటర్ లాగింగ్) చేరే ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టి నీటిని తొలగించేందుకు డీఆర్ ఎఫ్ బృందాలతో ట్రాఫిక్ పోలీసులు కలిసి పని చేయడం జరుగుతుంది. ఆయా శాఖాధికారులు గుర్తించిన వాటర్‌లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్షించారు. అలాంటి సమయాల్లో వెంటనే నీరు తొలిగించేలా హార్సు పవర్ ఎక్కువ ఉన్న మోటర్ల వినియోగం. ఆ నీటిని ఎక్కడకు తోడాలనే దానిపై చర్చలు జరిగాయి. ఆయా సమస్యల శాశ్వత పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి తీసుకోవాల్సిన ఆవశ్యకతల గురించి చర్చించారు. వరద కాలువలు, పైపుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం. కొత్త లైన్లను వేసి వరదకు శాశ్వత పరిష్కారం చూపడంపై చర్చ సాగింది. నగరంలో 144 వాటర్ లాగింగ్ పాయింట్లుంటే 65 హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ప్రాధాన్య క్రమంలో ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు. ప్రధాన రహదారులతో పాటు.. కాలనీల్లో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఉన్న శాశ్వత దుకాణాలను తొలగించాలని నిర్ణయించారు. దానికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫుట్‌పాత్‌లను, రహదారులను ఆక్రమించి దుకాణాలు ఏర్పటు చేసి వ్యాపారులకు సమాచారం ఇచ్చి వాటిని తొలగించాలని నిర్ణయించారు. హైడ్రా, జీహెచ్ ఎంసీ, ట్రాఫిక్ విభాగాలు సంయుక్తంగా పని చేసి.. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. నగర ప్రజలు సాఫీగా నడచుకుని వెళ్లే విధంగా ఫుట్‌పాత్‌లను రూపొందించడంపై ప్లానింగ్ చేశారు. ఫుట్‌పాత్‌ల మీద ప్రభుత్వ విభాగాలకు చెందిన (ట్రాన్స్‌ఫార్మర్లు, టెలిఫోన్ డక్ట్ లు, జీహెచ్ ఎంసీ చెత్త డబ్బాలు) లేకుండా ఆయా విభాగాలతో వాటిని తొలగించడంపై చర్చ సాగింది. కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లను, కొమ్మలను గుర్తించి వాటిని తొలగించడంపై చర్చ జరిగింది. ట్రాఫిక్, వరద నీటి సమస్య ఉత్పన్నమైనప్పడు ప్రాంతాలవారీ స్పందించే బృందాల సమాచారం ప్రజలకు తెలిసేలా ఏర్పాట్లు. ప్రజల భాగస్వామ్యంతో ట్రాఫిక్ ఫ్రీ నగరం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయిఇంచారు. నెలకోసారి ట్రాఫిక్- హైడ్రా విభాగాలు సమావేశమై.. చేపట్టిన, చేయాల్సిన కార్యక్రమాలపై సమీక్షించాలని నిర్ణయించారు.