Wednesday, January 22, 2025

ట్యాపింగ్‌- బ్లాక్‌మెయిలింగ్‌?

బాధితుల్లో రియల్టర్లు, జువెల్లర్స్‌, హవాలా ఆపరేటర్లు, సినీ తారలు?

హైద‌రాబాద్ మార్చ్ 25 నేరాలు-ఘోరాలు: ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో అరెస్టు అయి జైల్లో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీతరావు ఉన్నతాధికారుల ఆదేశాలతో వ్యాపారులకు బ్లాక్‌మెయిలింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేర్వేరు వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసిన ప్రణీతరావు… తనకు అంది వచ్చిన అవకాశాన్ని అధికారులతో కుమ్మక్కై స్వార్థం కోసం దుర్వినియోగం చేసినట్లు పోలీసుల కస్టడీ విచారణలో వెల్లడైంది. నగరంలోని ప్రధాన రియల్టర్‌లు, జువెల్లరీ వ్యాపారులు, ప్రముఖ హీరోయిన్ల నెంబర్లను సైతం ట్యాప్‌ చేసి వారి సంభాషణను రికార్డ్‌ చేసి వారిని బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు గుర్తించారు. అయితే ఈ వ్యవహారాన్ని కూడా అప్పటి ఇంటెలిజెన్స చీఫ్‌ ప్రభాకర్‌రావు, అధికారులు భుజంగరావు, తిరుపతన్నల ఆదేశాల మేరకే 36మంది వ్యాపారుల ఫోనలు ట్యాప్‌ చేసి వారిని బెదిరించినట్లు ప్రణీతరావు విచారణలో వెల్లడించాడు. వ్యాపారుల్లో ప్రధానంగా ప్రముఖ జువెల్లర్స్‌, హవాలా ఆపరేటర్‌లు, రియల్టర్‌లు, భవన నిర్మాణ కంపెనీ యజమానులు, కొంతమంది సినీ ప్రముఖులున్నట్లు తెలిసింది.
ఫిర్యాదు చేయండి
ఈ విషయంలో బాధితులెవ్వరూ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు. అయినా ఫోన ట్యాపింగ్‌ డేటాను పరిశీలిస్తున్నామని… వాటిలో బాధితులను గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. అయినా బ్లాక్‌మెయిల్‌, బెదిరింపులకు గురైన బాధితులెవరో ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. మాజీ మంత్రి, ఆయన బంధువులను కూడా అధికారులు బెదిరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇదంతా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే జరిగిందని కూడా పోలీసులు చెబుతున్నారు. తాజాగా అరెస్టు అయిన అదనపు డీసీపీ తిరుపతన్న, అదనపు ఎస్పీ భుజంగరావులకు అప్పట్లో ప్రభాకర్‌రావు, రాధాకిషనలు వేర్వేరు వ్యక్తుల (రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, రియల్టర్‌లు) ఫోన నెంబర్లు ఇచ్చి ట్యాప్‌ చేయమని ఆదేశాలివ్వడంతోనే వారు ప్రణీతరావుకు ఆదేశించినట్లు పోలీసుల విచారణలో పేర్కొన్నారు.
ఏ-1గా ప్రభాకర్‌రావు
పోన ట్యాపింగ్‌ వ్యవహారంలో నమోదైన కేసులో ప్రధాన నిందితుడి (ఏ-1)గా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు పేరు చేర్చారు. ఏ-2గా మాజీ డీఎస్పీ ప్రణీత, ఏ-3గా మాజీ ఓఎస్‌డీ (టాస్క్‌ఫోర్స్‌) రాధాకిషనరావులు ఉన్నారు. ప్రస్తుతానికి ప్రభాకర్‌రావు, రాధాకిషనరావులు పరారీలో ఉన్నారు. వారు అమెరికాలో తల దాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన అధికారులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసి ఎయిర్‌ పోర్టులలో అప్రమత్తం చేశారు.

Related Articles

Latest Articles