Saturday, April 27, 2024

బంగ్లా లింకులు- బాలాపూర్‌లో దందా

వీఓఐపీతో ఫోన్ కాల్స్‌… 300 సిమ్‌కార్డుల సేక‌ర‌ణ‌

న‌గ‌ర టాస్క్‌ఫోర్స్ దాడులో వెలుగు చూసిన‌ ఘ‌రానా మోసం

హైద‌రాబాద్ మార్చ్ 19 నేరాలు-ఘోరాలు:
బంగ్లా కేంద్రంగా సాగుతున్న అక్ర‌మ అంత‌ర్జాతీయ ఫోన్ కాల్స్ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వ‌హించారు. విదేశీ లింకుల‌తో సాగుతున్న దందాలో న‌లుగురు నిర్వాహ‌కుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీఓఐపీ (వాయిస్ ఓవ‌ర్ ఇంట‌ర్నెట్ ప్రొటోకాల్‌) ప‌ద్ధ‌తిలో అక్ర‌మ ఫోన్ కాల్స్ చేయ‌డం… అంత‌ర్జాతీయ కాల్స్‌ను లోక‌ల్ కాల్స్‌గా మార్చి… జాతీయ ఆదాయాన్ని గండి కొట్ట‌డం వీరి పంథా. బాలాపూర్ కేంద్రంగా సాగుతున్న ఈ దందా గురించి ఉప్పందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నెల రోజులుగా క‌స‌ర‌త్తు చేసి ఎట్ట‌కేల‌కు గ్యాంగ్ మూలాల‌ను ఛేదించారు. ఓ హెడ్ కానిస్టేబుల్‌, మ‌రో అధికారి చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో దేశ భ‌ద్ర‌త‌, జాతీయ ఆదాయానికి ప్ర‌మాద‌క‌రంగా మారిన ముఠా మూలాల్లోకి వెళ్ల‌గ‌లిగారు. ప్ర‌స్తుతానికి వారిని విచారిస్తున్న అధికారులు మ‌రింత కీల‌క స‌మాచారం రాబ‌ట్టే అవ‌కాశ‌ముంది.
ఫోన్ నెంబ‌ర్ రాదు
కేవ‌లం భ‌ద్ర‌తా ప‌రంగా మాత్ర‌మే కాకుండా నేరాల‌కు, సైబ‌ర్ నేరాల‌కు, మోసాల‌కు ఆస్కారం క‌లిగించేలా ఈ దందా సాగి ఉంటుంద‌ని అధికారులు అనుమానిస్తున్నారు. వీఓఐపీ ద్వారా చేసే ఫోన్‌కాల్స్‌లో ఎక్క‌డా నెంబ‌ర్ డిస్‌ప్లే కాక‌పోవ‌డం..దాంతో అసాంఘిక శ‌క్తులు, మోస‌గాళ్ల‌కు ఎంతో క‌లిసొచ్చే ఉంటుంది. విచారిస్తున్న అధికారులు ఆయా కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌ రాష్ట్ర‌వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేసిన డీఎస్పీ ప్ర‌ణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం నేప‌థ్యంలో వీఓఐపీ ఫోన్ కాల్స్ ముఠా చిక్క‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ట్యాపింగ్‌కు ఆస్కారం లేకుండా ఉండేందుకు వీఓఐపీ దందా సాగిందా అనేదీ ప్ర‌శ్నార్థ‌క‌మే.
300 సిమ్‌కార్డులు?
దాడులు చేసిన పోలీసులు నిందితుల వ‌ద్ద సుమారు 300 సిమ్‌కార్డుల‌ను, ఫోన్ ప‌రిక‌రాల‌ను, ఇత‌ర సాంకేతిక యంత్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అంత మొత్తంలో సిమ్‌కార్డుల‌ను నిందితులు ఎలా సేక‌రించ‌గ‌లిగారు. వారికి సిమ్‌కార్డులు స‌ర‌ఫ‌రా చేసిందెవ‌ర‌నేది మ‌రోప్ర‌శ్న‌. ఎలాంటి ఆధారాలు లేకుండా వారికి సిమ్‌కార్డులు ఇచ్చిన టెలికాం ఏజెంట్లు ఎవ‌రు.. ఇప్పుడు ప్రారంభ‌మైన పోలీస్ విచార‌ణ‌లో ఎవ‌రెవ‌రు ముందుకు వ‌స్తార‌నేదీ ఆస‌క్తిక‌రంగా మారింది.
విదేశీ లింకులు
వీఓఐపీ ద్వారా జ‌రిగిన కాల్స్ వ్య‌వ‌హారంలో పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ లింకులున్నాయ‌ని పోలీసులు గుర్తించిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ విష‌యంలో అధికారులు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విదేశీ లింకులు బ‌య‌ట‌కు రాగానే ఈ దందాలో నిమ‌గ్న‌మై ఉన్న వారు త‌ప్పించుకునే అవ‌కాశాలున్నందున జాగ్ర‌త్త‌గా డీల్ చేస్తున్నారు. ఈకేసు ద‌ర్యాప్తులో ఎన్ని నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో వేచి చూడాల్సిందే.

Related Articles

Latest Articles